ఎవరికీ భయపడం, అందర్నీ ప్రేమిస్తాం: హోదాపై యూఎస్‌లో పవన్ కీలక వ్యాఖ్యలు
అమెరికా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు సమావేశాల్లో పాల్గొని అనేక అంశాలపై తన ప్రంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు సమావేశాల్లో పాల్గొని అనేక అంశాలపై తన ప్రంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండీ జవాబుదారీతనం లేకుండా బాధ్యతారాహిత్యంగా, ఉదాసీనంగా ఉంటే ఊరుకోబోమని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. వారు అలా ఉన్నందునే తాము పోరాడుతున్నామన్నారు.
పర్యటన చివరి రోజు సోమవారం అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన కీలకోపన్యాసం ఇచ్చారు. 'ఇండియా ఈజ్ రైజింగ్ గ్లోబల్ పవర్' అనే అంశంపై సుమారు గంటసేపు ఇంగ్లీష్‌లో సాగిన ప్రసంగంలో.. దేశ రాజకీయాలు, సామాజిక స్థితిగతులు, పార్టీ దృక్పథం వంటి అంశాలను ప్రస్తావించారు.

హోదా నెరవేర్చాల్సిందే..
ప్రస్తుత పాలకులు ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిందే అన్నారు. దాని నుంచి ఎందుకు వెనక్కి తగ్గారో వారు ప్రజలకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సభికుల ప్రశ్నలకు సమాధానమిచ్చే సందర్భంలో ప్రత్యేక హోదా ప్రస్తావన రాగా పవన్ పైవ్యాఖ్యలు చేశారు.

అనేక అంశాలపై..
అంతకు ముందు భారత రాజకీయాలు, సామాజిక స్థితిగతులు, జనసేన పార్టీ దృక్పథం లాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. అందులో ముఖ్యాంశాలివి.. ‘హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగం అంటే చిన్న విషయం కాదు. అందుకే నాకు ఆహ్వానం అందినప్పుడు ఆలోచించాను. కొంత సమయం తీసుకున్నాకే ఇక్కడికి వచ్చేందుకు అంగీకరించాను' అని తెలిపారు.

ప్రపంచ శక్తిగా భారత్ ఎదగాలంటే..
‘‘ఈ రోజు ప్రపంచ శక్తిగా ఎదుగుతోన్న భారత్' అనే అంశంపై ప్రసంగించాల్సి ఉన్నా నాకున్న అనుభవం మేరకు మొత్తం దేశం గురించి చెప్పలేనేమో. కానీ, తెలుగు రాష్ట్రాల వ్యక్తిగా ఆ ప్రాంతాల దృక్కోణం నుంచి చెబుతాను. దేశం అభివృద్ధి చెందుతోంది కానీ ఆ ఫలాలు మాత్రం ఏ కొద్దిమందికో అందుతున్నాయి. ఎన్నో సమస్యలు దశాబ్దాలుగా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇందుకు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండ వ్యాధుల తీవ్రతే ఉదాహరణ. ఇలాంటి సమస్యలెన్నో నాయకుల ఉదాసీనత కారణంగా పెరిగి పెద్దవైపోతున్నాయి' అని అన్నారు.

మనమంతా ఒక్కటే...
‘దేశంలో మరో సమస్య.. ఉదాసీన సమాజం. పక్కవాడికి అన్యాయం జరిగితే ప్రశ్నించి ఎదిరించే తత్వం కొరవడింది. ఏదో చేయాలన్న ఆలోచనలున్నా.. అవి సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకే పరిమితమవుతున్నాయి. దేశంపై ప్రజలందరికీ ప్రేమ ఉంది. కానీ మనమంతా ఒక్కటే అన్న భావన మరింత పెరగాలి' అని పవన్ వివరించారు.

మార్పు రావాలి..
అంతేగాక, ‘మన నాయకుల్లో మార్పు రావాలి. నాయకులు సమాజాన్ని విభజించి పాలించే ధోరణి వల్ల నష్టాల్ని చూసి తట్టుకోలేక ప్రతిఘటించేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. ప్రసంగం తరవాత సభికులు అడిగిన ప్రశ్నల్లో భాగంగా రైతుల ఆత్మహత్యల నివారణపై మాట్లాడుతూ రైతుల్లో ముందుగా ఆశావహ దృక్పథం పెంచాలి' అని పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

అందుకే రాజకీయాల్లోకి..
‘స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో గాంధీజీ దేశమంతా పర్యటించారు. కానీ ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఎంతమందికి ఇండియా మొత్తం తెలుసు..? వారిలో మార్పు రావాలి. నాయకులు సమాజాన్ని విభజించి-పాలించే ధోరణితో వ్యవహిస్తుండటం వల్ల జరుగుతున్న నష్టాలను చూసి తట్టుకోలేకపోయాను. వాటిని ప్రతిఘటించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను' అని పవన్ పేర్కొన్నారు.

ఎవరికీ భయపడం
‘నా వరకు నేను భావితరాల కోసం శక్తిమేరకు సాధ్యమైనంత చేయాలనుకుంటున్నాను. భారతదేశం వేదభూమి. సత్య,ధర్మాలకు ప్రతీక. హిమాలయాలు సహా ఎన్నో చారిత్రక వైభవాల నిలయం. మేం అందరినీ ప్రేమిస్తాం. ఎవరికీ భయపడం. అందరినీ గౌరవిస్తాం. ఎవరికీ లొంగం.. భారత మాతాకీ జై'.. అంటూ ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications