రాజకీయంగా విడిపోయినా భారతీయులుగా కలిసే ఉన్నాం : పవన్ కల్యాణ్
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రాజకీయంగా వేరైనా, భారతీయులుగా కలిసే ఉంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది సరిహద్దు రాష్ట్రాల మధ్య సోదర భావానికి ప్రతీక అని పేర్కొన్నారు.
గత రెండు దశాబ్దాలుగా ఏనుగుల దాడి వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు ధ్వంసం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, ఈ నష్టాన్ని నివారించేందుకు కర్ణాటక సహకారం కోరామన్నారు. కర్ణాటక అందించిన కుంకీ ఏనుగులు భవిష్యత్తులో ప్రాణనష్టం, పంట నష్టాన్ని నివారిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీ సంపద పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఇరు రాష్ట్రాలు సహకరించుకుంటాయని తెలిపారు.

రాజకీయంగా వేర్వేరు కూటములకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణ కోసం కర్ణాటక ముందుకు రావడం అభినందనీయమన్నారు. కర్ణాటక అందించిన ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటామని, వాటి సంరక్షణను తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కుంకీ ఏనుగుల కోసం పలమనేరు దగ్గర ప్రత్యేక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.













Click it and Unblock the Notifications