ప్రభాస్ ఫ్యాన్స్‌తో రగడ: ఎమ్మెల్యే, ఎంపీలకు పవన్ కళ్యాణ్ ఫోన్!
హైదరాబాద్: భీమవరం ఘటన పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనస్తాపం చెందారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రభాస్ అభిమానుల మధ్య రగడ తెలిసిందే. తన అభిమానులు ప్రతిచర్యకు దిగడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
భీమవరంలో అభిమానులు ఫ్లెక్సీ సంఘటన పైన చోటు చేసుకున్న దాడుల సంఘటన మనస్తాపం కలిగించిందని, భౌతిక దాడులకు నేను వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ శనివారం నాడు చెప్పారు. ఘటన విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ స్పందించడం గమనార్హం.
అంతేకాదు, ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని కోరారు. ఇరువర్గాలకు చెందిన వారు పెద్దలతో చర్చించాలని, ఇందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులను ఒక వేదిక మీదకు తీసుకు వచ్చి చర్చించాలని పవన్ కళ్యాణ్ సూచించారని చెబుతున్నారు.

కాగా, అభిమానుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులుతోను, నరసారావుపేట ఎంపీ గోకరాజు గంగరాజుతోను ఫోన్ ద్వారా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సున్నితమైన వ్యవహారం కాబట్టి పరిష్కరించాలని కోరారని తెలుస్తోంది.
కాగా, అరెస్టైన పవన్ కళ్యాణ్ అభిమానుల బెయిల్ మంజూరుకు నేతలు కృషి చేశారని చెబుతున్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ రావుతోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా భీమవరంలో ఇరువురు టాప్ హీరోల అభిమానుల మధ్య ఘర్షణ... సామాజిక వర్గాల తగాదాగా మారిపోయిందనే ఆందోళనలు కూడా వ్యక్తమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications