వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఇలా ! ఢిల్లీలో తేల్చేసిన పవన్- సీఎం పదవిపైనా క్లారిటీ..!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై ఇప్పటివరకూ జరుగుతున్న చర్చకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఏపీలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయో ఆయన దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంతో పాటు రాబోయే ఎన్నికల్లో పొత్తులు,సీఎం పదవి వంటి అంశాలపై ఎన్డీయే భేటీలో పాల్గొనడానికి ముందు పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.
Recommended Video

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసే పోటీ చేస్తాయనుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ, బీజేపీ మధ్య అండర్‍స్టాడింగ్ ఇష్యూ ఉందన్నారు. వాళ్ల మధ్య సమస్యలపై మాట్లాడలేనన్నారు. కానీ ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తామని భావిస్తున్నట్లు పవన్ వెల్లడించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనేది తమ విధానం అన్నారు. 2014లో కలిసే పనిచేశాం, 2019లో విడిపోయామని పవన్ గుర్తుచేశారు.

2020లో బీజేపీ-జనసేన ఒకే వేదికపైకి వచ్చాయని, క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిపై స్పష్టత వస్తుందని కూడా పవన్ తెలిపారు. మా ప్రాధాన్యత వైసీపీని ఓడించి రాష్ట్రాన్ని డెవలప్ చేయడమే అన్నారు. సీఎం ఎవరనేది సమస్య కాదని, జనసేన కేడర్ తనను సీఎంగా చూడాలనుకుంటోందన్నారు.
మరోవైపు రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ విఫలమైందని పవన్ ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు లేక, పనులు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. జనసేన ప్రశ్నిస్తోంది, ప్రజల మద్దతు కూడగడుతోందని పవన్ తెలిపారు.
ఏపీలో అభద్రత, శాంతిభద్రతల సమస్యలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో ఎన్డీయే మీటింగ్ సీనియర్ మంత్రుల నేతృత్వంలో జరగబోతుందని, న్డీఏ విధానాలు ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లే విషయమై చర్చించే అవకాశం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, రాజకీయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. మరిన్ని పొత్తులపైనా ఈ సమావేశంలో స్పష్టత రావచ్చని పవన్ క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications