5 లక్షల పరిహారం, ఇకపై సభలు పెట్టను: అభిమాని మృతిపై పవన్
అమరావతి: కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్స్‌లో శుక్రవారం 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'లో చోటు చేసుకున్న తొక్కిసలాట కారణంగా మృతి చెందిన అభిమానిపై పవన్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభిమాని చనిపోవడం బాధాకరమని అన్నారు.
అభిమాని వెంకట రమణ (22) కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటామని చెప్పారు. కాకినాడలో శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించిన అనంతరం చోటుచేసుకున్న అపశ్రుతిలో పవన్ అభిమాని వెంకటరమణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

శనివారం కాజులూరు మండలం కుయ్యూరులోని వెంకటరమణ ఇంటికి వెళ్లిన పవన్ అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెంకటరమణ చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే తాను సభలు ఏర్పాటు చేయడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇకపై సభలు నిర్వహించబోనని స్పష్టం చేశారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం కొత్తూరు పరిధిలోని కిరణ్ కంటి ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ కంటి వైద్యసేవలు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
హోదా కోసం ప్రజాప్రతినిధులు పోరాటం చేయాలని పవన్ డిమాండ్ చేశారు. కాగా, కాకినాడలో శుక్రవారం జరిగి పవన్ సభా ప్రాంగణంలో వెంకటరమణ సౌండ్ బాక్స్‌లు పెట్టే స్టాండ్ పైకి ఎక్కి కూర్చున్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో సౌండ్ బాక్స్‌లకు చెందిన వైర్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు.
ఆయనను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటరమణ తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలంలోని కుయ్యూరు నివాసి. వృత్తిరీత్యా రీత్యా వెంకట రమణ స్థానికంగా ఓ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి అబ్దుల్ వ్యవసాయ కూలీ కాగా, సోదరుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అతడికి తల్లి తండ్రి, సోదరి, తమ్ముడు ఉన్నారు. కాగా సోదరి చిన్నప్పటి నుంచే మూగ. వెంకటరమణ దుర్మరణం నేపథ్యంలో.. కూలీ పని చేసుకునే అతని కుటుంబ పరిస్థితి ఇప్పుడు మరింత సంక్షోభంలో పడింది. సభకు వచ్చిన అభిమానుల్లో ఏడుగురు తీవ్రగాయాల పాలయ్యారు.
వై.రామవరం మండల కేంద్రానికి చెందిన రాజు.. సౌండ్ బాక్స్‌ల స్టాండ్ పైకి ఎక్కుతుండగా జారిపడి తలకు గాయమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రామచంద్రపురం మండలం ఎల్లకావరానికి చెందిన కురసాల సుబ్రహ్మణ్యం చెట్టుకొమ్మ ఎక్కి కూర్చున్నాడు.
కొమ్మ విరిగి కింద ఉన్న పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పుప్పాల ప్రసాద్‌పై పడింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం కుడి కాలు విరిగిపోగా, ప్రసాద్ తలకు తీవ్ర గాయమైంది. ఆత్రేయపురం మండలం లొల్లకు చెందిన ఆర్.రాజు గోడపై నుంచి కిందపడటంతో కుడిభుజం విరిగిపోయింది.
అభిమాని కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించిన పవన్
సినీ నటుడు పవన్ మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం జరిగిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వెంకటరమణ కుటుంబానికి, జనసేన అధ్యక్షుడు పవన్ రూ. 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తన అభిమాని వెంకటరమణ మృతి తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. తన వల్ల ఎవరూ నష్టపోవడం ఇష్టం ఉండదని చెప్పారు. ఉద్యమానికి వేరే మార్గాన్ని ఆలోచిస్తానని తెలిపారు. సభల్లో కార్యకర్తలు ప్రమాదాల బారిన పడి మృతి చెందడంతో పవన్ ఎంతో ఆవేదనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications