రంగంలోకి జనసేన, పావులు కదుపుతున్న బాబు: పవన్ కళ్యాణ్ 'మాట'తోనే రివర్స్
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం, ఆ పార్టీ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్‌గా మారుతుండటంతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైందని చెప్పవచ్చు. జనసేన కార్యకర్తలు సమావేశానికి కూడా ప్లాన్ చేసుకున్నారు.
2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవరితోనైనా పొత్తుతో వెళ్తారా? చంద్రబాబుకు ఇలాగే మద్దతిస్తారా? ఒంటరిగా వెళ్తారా? తేల్చలేదు.
ఈ నేపథ్యంలో టిడిపి తనదైన శైలిలో స్పందిస్తోంది. ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పోటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అదే సమయంలో తమతో వస్తేనే మంచిదని చెబుతున్నారు.

టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ... దేశంలో ఎవరికైనా రాజకీయ పార్టీ పెట్టే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తానని అన్నారని, అలాంటప్పుడు టిడిపితో పొత్తు కూడా పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఆయన తమకు సహకరించారని గుర్తు చేశారు.
2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడాన్ని ఓ మిత్రపక్షంగా స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమ చెప్పారు. పవన్ టిడిపి భాగస్వామ్యంతోనే బరిలోకి దిగుతారని భావిస్తున్నామని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయబోరని అనుకుంటున్నామన్నారు. గత ఎన్నికల్లో ఆయన తమకు మద్దతిచ్చారని, ప్రచారం కూడా చేశారని చెప్పారు. ఇకపై కూడా ఓ జట్టుగా ముందుకు వెళితేనే మంచిదన్నారు.












Click it and Unblock the Notifications