జనసేన అభ్యర్థుల చేతికి బీఫాంలు?
Pawan Kalyan: ఇంకో రెండు రోజుల్లో ఏపీలో నామినేషన్ల పర్వం ఆరంభం కాబోతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 18వ తేదీన తెరలేవబోతోంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25. 26వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు.
నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది. అధికారంలోకి వచ్చేదెవరనేది తేలేది అప్పుడే.

నామినేషన్ల గడువు సమీపించిన నేపథ్యంలో- అన్ని పార్టీలు కూడా దీనిపై దృష్టి పెట్టాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన పులివెందులలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. చివరి రోజు కావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. అదే రోజున నామినేషన్ వేస్తారు.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. తన పార్టీ అభ్యర్థులందరికీ నేడు బీఫాంలను అందజేయనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ మధ్యాహ్నం వారందరితో సమావేశం కానున్నారాయన. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమీక్షించనున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
పిఠాపురం- పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల- లోకం మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్- పంతం నానాజీ, రాజానగరం- బత్తుల బలరామకృష్ణ, తెనాలి- నాదెండ్ల మనోహర్, నిడదవోలు- కందుల దుర్గేష్, పెందుర్తి- పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తోన్నారు.
పీ గన్నవరం- గిడ్డి సత్యనారాయణ, రాజోలు- దేవ వరప్రసాద్, అవనిగడ్డ- మండలి బుద్ధప్రసాద్, భీమవరం- పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం- బొమ్మిడి నాయకర్, తిరుపతి- ఆరణి శ్రీనివాసులు, విశాఖపట్నం సౌత్- వంశీకృష్ణ యాదవ్, పోలవరం- చిర్రి బాలరాజు, రైల్వే కోడూరు- అరవ శ్రీధర్, పాలకొండ- నిమ్మక జయకృష్ణ పోటీలో చేస్తోన్నారు.
కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థులుగా ఉదయ్ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరి రంగంలో నిలిచారు. పవన్ కల్యాణ్ వారందరికీ బీఫాంలను అందజేయనున్నారు.












Click it and Unblock the Notifications