పొత్తులపై ఫైనల్, ఢిల్లీకి పవన్ - చంద్రబాబు దగ్గరే "లాక్"..!!
రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో రెండో జాబితాకు బీజేపీ సిద్దమైంది. జనసేనతో పొత్తు పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో పవన్ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్లున్నారు. తెలంగాణతో పాటుగా ఏపీ రాజకీయాలను చర్చించనున్నారు. తెలంగాణలో తాము సహకరిస్తామని..ఏపీలో తమతో కలిసి రావాలని కోరేందుకు సిద్దమయ్యారు. ఈ ఫార్ములాకు బీజేపీ నిర్ణయం ఆధారంగా పొత్తుల అంశం తేలిపోనుంది.
పొత్తుపై నేడు స్పష్టత:తెలంగాణపైనే ప్రధానంగా బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ..రెండో లిస్టుపై కసరత్తు చేస్తోంది. తొలి జాబితా తరువాత పార్టీలోని కొందరు ముఖ్య నేతలు పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో తెలంగాణలో జనసేనతో పొత్తు ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. తెలంగాణలో జనసేన 32 స్థానాల్లో పోటీకి సిద్దమైంది. పవన్ తో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో సహకారం పైన చర్చించారు. కానీ, పొత్తు..ఎన్ని సీట్లు పొత్తులో భాగంగా ఇస్తారనేది ఫైనల్ కాలేదు. వీటి పైన చర్చ కోసం బీజేపీ నేతలతో పాటుగా పవన్ ఢిల్లీ వెళ్లున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

రెండు రాష్ట్రాల్లో సహకారం కోసం:జనసేనకు 5లేదా 6 ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉంది. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సెగ్మెంట్లతో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని సరిహద్దు నియోజకవర్గాలను కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. కనీసం 20 సీట్లు కేటాయించాలని కోరుతున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమైన సమయంలో తెలంగాణలో తాము సీట్ల విషయంతో పాటుగా మద్దతు పరంగా సహకరిస్తామని..ఏపీ అంశం పైన తేల్చాలని కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తాను ఎన్డీఏలోనే భాగస్వామిగా ఉన్నానని..ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో తాను టీడీపీతో పొత్తు ప్రకటించాల్సి వచ్చిందని వివరిస్తారని చెబుతున్నారు. తెలంగాణలో సహకారం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలు పవన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలో బీజేపీ వైఖరి ఏంటనేది పవన్ తెలుసుకొనే ప్రయత్నాం చేస్తారని తెలుస్తోంది.

చంద్రబాబుదే తుది నిర్ణయం:తాజాగా పవన్ - లోకేశ్ సారధ్యంలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ సమావేశంలోనూ బీజేపీతో పొత్తుపైన చర్చకు వచ్చింది. బీజేపీ తమతో కలిసి వస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేసారు. అయితే, బీజేపీ నాయకత్వం వైసీపితో సఖ్యతగా ఉందని..బీజేపీతో పొత్తు కారణంగా రాజకీయంగా ప్రయోజనం ఉండదని సమావేశంలోనే టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో జనసేన నుంచి ఒకరిద్దరు నేతలు మద్దతు తెలిపారు. దీంతో, జోక్యం చేసుకున్న లోకేశ్ ఏం జరుగుతుందో చూద్దాం..
చంద్రబాబు బయటకు వచ్చిన తరువాతనే స్పష్టత వస్తుందంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో, బీజేపీతో సంబంధాలను ప్రస్తుతానికి కొనసాగించే బాధ్యత పవన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు..సహకారం పైన చంద్రబాబు బయటకు వస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలు పవన్ తో చర్చల సమయంలో ఏం జరుగుతందనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications