Pawan Kalyan: టీడీపీ మాజీ మంత్రి వియ్యంకుడికి పవన్ సీటు త్యాగం ?
ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎలాగైనా అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పట్టుదలగా ఉన్న జనసేన అధినేత ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుని, బీజేపీని తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్న పవన్.. మరోవైపు క్షేత్రస్ధాయిలోనూ గెలుపు కోసం వ్యూహాల్ని పదునుపెడుతున్నారు. ఇందుకోసం త్యాగాలకు సైతం సిద్దమైపోతున్నారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిన ఓ సీటులో తిరిగి పోటీకి సిద్దమైన పవన్ .. చివరి నిమిషంలో దీన్ని త్యాగం చేసేశారు.
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంతో పాటు విశాఖ జిల్లా గాజువాక సీట్ల నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్లా ఓడిపోవడంతో తిరిగి ఆ నియోజకవర్గాలవైపు చూడలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో తిరిగి భీమవరంలో పోటీకి పవన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు స్ధానికంగా ఉన్న టీడీపీ నేతలను ఇళ్లకు వెళ్లి కలిశారు. తాను పోటీలో ఉంటానని, మద్దతివ్వాలని కోరారు. కానీ అంతలోనే సీన్ రివర్స్ అయింది.

గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి దిగి తనతో పాటు ఓడిపోయిన టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు కూడా అయిన పులపర్తి రామాంజనేయులు ఇక్కడి నుంచి మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. దీంతో రామాంజనేయులు కోసం భీమవరం సీటును త్యాగం చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. అయితే రామాంజనేయులు టీడీపీని వీడి జనసేనలోకి రావాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు ఆయన క్లారిటీ ఇచ్చేశారు. పవన్ కూడా తన నియోజకవర్గంలో ఎలాగైనా జనసేన గెలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.












Click it and Unblock the Notifications