ఆ ఎన్నికలపై రీ నోటిఫికేషన్ ఇవ్వండి .. లేదంటే న్యాయపోరాటం చేస్తాం : పవన్ కళ్యాణ్ అల్టిమేటం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఏడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఎన్నో అక్రమాలు జరిగాయని, జనసేన నాయకులను బెదిరించి మరీ నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. రీ నోటిఫికేషన్ ఇవ్వకుంటే న్యాయపోరాటానికి సిద్ధం అంటున్నారు .

బెదిరింపుల ఆధారాలతో నామినేషన్లు వెయ్యటానికి వెళ్ళినా న్యాయం జరగటం లేదు
బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేని వారు తగిన ఆధారాలతో వస్తే మరోసారి అవకాశం కల్పిస్తామన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన నేపథ్యంలో పలువురు ఆధారాలతో కలెక్టర్ ఆఫీస్ లకు వెళ్ళినా, కిందిస్థాయి అధికారులు నామమాత్రంగా ఫిర్యాదులు తీసుకుని వెనక్కి పంపుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. కిందిస్థాయి అధికారుల తీరుతో ఎన్నికలలో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు న్యాయం జరగడం లేదన్నారు.

రీ నోటిఫికేషన్ ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి .. లేదంటే న్యాయపోరాటమే
అందుకే మళ్లీ నోటిఫికేషన్ ఇస్తే తప్ప న్యాయం జరగదని తాము భావిస్తున్నట్లు చెప్పిన పవన్ కళ్యాణ్ రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తగిన న్యాయం చేస్తామని చెబుతున్నప్పటికీ, న్యాయం జరిగేలా కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇదే అంశంపై జనసేన లీగల్ సెల్ తో కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో కోర్టు మెట్లెక్కుతామని స్పష్టం చేస్తున్నారు.

జనసేన మాత్రమే ప్రతిపక్ష పార్టీలు రీ నోటిఫికేషన్ కే డిమాండ్
హైకోర్టులో ఈ వ్యవహారంపై అప్పీల్ చేయనున్నట్లు వెల్లడించిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త నోటిఫికేషన్ పై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒకపక్క జనసేన పార్టీ మాత్రమే కాకుండా, టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సైతం కరోనా లాక్ డౌన్ కు ముందు జరిగిన ఎన్నికలలో బెదిరింపుల పర్వాలు కొనసాగాయని , వాటిని రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాయి .

ఎస్ఈసి నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ పై తీవ్ర అసహనం
ఇదే సమయంలో ఎన్నికల సమయంలో వైసీపీ అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను, రీ నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత ఎన్నికలకు కొనసాగింపుగా నిర్వహించడం కోసం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష పార్టీల ఆగ్రహానికి కారణంగా మారింది.