ఇంద్రీకీలాద్రికి పవన్ కల్యాణ్ - పార్టీలో ముఖ్య నేత చేరిక..!?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంద్రకీలాద్రి దర్శించుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..తన ప్రచార రధానికి పూజలు చేయిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిలో తొలి పూజ చేయించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఇంద్రకీలాద్రిలో అమ్మవారి సన్నిధిలోనూ పూజ చేయించనున్నారు. పవన్ ముందుగా దుర్మమ్మను దర్శించుకుంటారు. తరువాత అమ్మవారి సన్నిధానంలో వారాహికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. తెలంగాణలోని దర్శపురిలో అనుష్టుప్ నరసింహయాత్ర ప్రారంభించిన పవన్ ఇప్పుడు ఇంద్రీకీలాద్రిలో పూజలకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో రెండు రోజుల పాటు పవన్ విజయవాడలోనే బస చేస్తారు. రిపబ్లిడ్ డే జెండా ఆవిష్కరణ మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తారు. ఇదే సమయంలో రాజకీయంగానూ కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో పొత్తులపై పవన్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసారు. తాము బీజేపీతో కలిసే ఉన్నామని స్పష్టం చేసారు. బీజేపీ నేతలు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చేసిన రాజకీయ తీర్మానంలో ఎక్కడా జనసేన ప్రస్తావన లేదు. టీడీపీ - వైసీపీతో మాత్రం పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. పవన్ తాను బీజేపీతో ఉాన్నామని చెబుతూనే..వద్దనుకుంటే సొంతంగా పోటీ చేస్తామని.. లేదంటే కలిసొచ్చే పార్టీలతో కలిసి వెళ్తామని స్పష్టం చేసారు. దీని ద్వారా రాజకీయంగా రెండు ప్రత్యామ్నాయాలను పవన్ సిద్దం చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. టీడీపీతో పవన్ దగ్గరవుతున్న వేళ బీజేపీ అప్రమత్తం అయింది. 2014 తరహాలో బీజేపీ, టీడీపీ, పవన్ కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు- పవన్ కోరుకుంటున్నారు. అందుకు బీజేపీ సిద్దంగా లేదనేది తాజా రాజకీయ తీర్మానంతో క్లారిటీ వచ్చింది.

ఇక, బీజేపీ తో కలిసే ఉన్నామని చెబుతున్న వేళ.. జనసేనలో బీజేపీ ముఖ్య నేత కన్నా లక్ష్మీనారాయణ చేరిక పైన డైలమా కొనసాగుతోంది. మాజీ మంత్రిగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన కన్నా జనసేనలో చేరేందుకు సిద్దం అయ్యారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలితో విభేదిస్తున్నారు.ఇప్పుడు ఎన్నికల వరకు సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది. ఈ సమయంలోనే వీర్రాజు తీరుకు నిరసనగా పెద్ద సంఖ్యలో కన్నా అనుచరులు బీజేపీకి రాజీనామా చేసారు. రిపబ్లిక్ డే రోజు కన్నా జనసేనలో చేరాలని భావించారని ప్రచారం సాగుతోంది. అయితే, బీజేపీతో ఇంకా వేచి చూసే ధోరణి తో ఉన్న పవన్..ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న కన్నా ను వెంటనే పార్టీలో చేర్చుకుంటారా...మరి కొంత కాలం వేచి చూసే ధోరణితో ఉంటారా అనేది ఈ రోజు..లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.