రూటు మార్చిన పవన్: చంద్రబాబుకూ అల్టిమేటం- విశాఖ కేంద్రంగా
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి విజయయాత్రను విశాఖపట్నంలో కొనసాగిస్తోన్నారు. జగదాంబ జంక్షన్, రిషికొండల్లో పర్యటించిన అనంతరం ఆయన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
వారాహి యాత్ర సందర్భంగా గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎప్పట్లాగే విమర్శలు సంధించారు. వైఎస్ జగన్ పరిపాలన తీరును తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీకీ అల్టిమేటం జారీ చేశారు. గాజువాకలో ఓటమిపైనా స్పందించారు.

గాజువాక తన సొంత నియోజకవర్గమని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. ఒక ఆశయంతో తాను ఈ నియోజకవర్గంలో పోటీ చేశానని, ఓటర్లు తనను ఓడించారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ దోపిడీ చేస్తాడని తెలిసి కూడా ఈ నియోజకవర్గం ఆయనను గెలిపించిందని, తనకు ఓటమిని ఇచ్చిందని పేర్కొన్నారు.
తనను ఓడించిన అదే గాజువాకలో ప్రజల నుంచి అఖండ స్వాగతం లభించిందని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను ఇక్కడ ఓడిపోయిన విషయాన్ని మరిచిపోయేంతగా ఘన స్వాగతం పలికారని, ఇంతటి ప్రేమను తాను ఊహించలేదని అన్నారు. రెండు లక్షల మందికి పైగా జనం వచ్చారని చెప్పుకొచ్చారు.
ఒక ఆశయంతో ఉన్న వాడికి గెలుపోటములు అతీతం అని గాజువాక ఓటర్లు నిరూపించారని పవన్ కల్యాణ్ అన్నారు. 2024 ఎన్నికల్లో తాము గాజువాక నుంచి పోటీ చేస్తామని, గెలిచేది కూడా జనసేన పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని తాము ఎవరికోసమో వదలదలచుకోలేదని తేల్చి చెప్పారు. ఈ సీటు జనసేనదేనని పదేపదే చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తమ పార్టీ జెండా ఎగురుతుందని అన్నారు.
హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకునే వాడికి నీకు వైజాగ్ రాజకీయాలు ఎందుకు అంటూ స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీని ఉద్దేశించి విమర్శించారు. సంక్షేమం పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యాస వైసీపీ లేదని, జగన్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మీద పోరాటం చేస్తుంటే వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడట్లేదని పవన్ కల్యాణ్ నిలదీశారు. విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఒక రౌడీషీటర్ అని ఆరోపించారు. ఒక రౌడీషీటర్‌ను వైజాగ్ ఎంపీగా గెలిపించారని ఓటర్లను తప్పుపట్టారు. అలాంటి ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడగలరా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications