బిజెపి,టిడిపి కూటమికి పవన్ కళ్యాణ్ ప్రచారం!
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల కూటమికి మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి బహిరంగంగా మద్దతు తెలపడమే కాకుండా.. గుజరాత్‌కు వెళ్లి మోడీని కలిసిన పవన్ కల్యాణ్‌ను ప్రచారంలో దింపేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజెపి శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బిజెపి శ్రేణుల ప్రయ్నతాలు సఫలమైతే రెండు ప్రాంతాల్లోనూ ఈ కూటమికి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నేతలు, పవన్‌వంటి స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారానికి తేదీల ఖరారు యత్నాల్లో బిజెపి శ్రేణులు తలమునకలయ్యాయి. ఇది ఇలా ఉండగా పార్టీ ప్రచారం, టిడిపి పొత్తు సమన్వయంపై బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రచార కమిటీలతో భేటీ అయ్యారు. నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేత సుష్మాస్వరాజ్ పర్యటన తేదీలపై భేటీలో కసరత్తు చేశారు. ఏప్రిల్ 20, 24 తేదీల్లో మోడీ పర్యటనకు వస్తే బాగుంటుందన్న అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

సుష్మా స్వరాజ్ పర్యటనను ఏప్రిల్ 28 నుంచి నెలాఖరు మధ్య నిర్ణయించాలనుకున్నారు. ఇటీవల పార్టీలో చేరిన సినీ నటులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బిజెపి నిర్ణయించింది.
జాతీయ నేతలు, స్టార్ క్యాంపెయినర్ల కోసం బిజెపి ఇప్పటికే ఒక హెలికాప్టర్‌ను సిద్ధం చేసింది. కాగా.. టిడిపితో సమన్వయం చేసుకుని గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని బిజెపి నేతలకు జవదేకర్ సూచించారు. ఇందుకోసం జిల్లా, అసెంబ్లీ స్థానాల స్థాయిల్లో కమిటీలు వేయాలని బిజెపి నిర్ణయించింది.
అసెంబ్లీ స్థాయిలో రాష్ట్రస్థాయి నేతలను ఇంఛార్జులుగా నియమించాలని నిర్ణయించారు. కాగా, ఏప్రిల్ 25నుంచి మే 4 లోపు సీమాంధ్రలోని నాలుగైదు స్థానాల్లో మోడీతో ప్రచారం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ కమిటీ ప్రయత్నిస్తోంది. ఇది ఇలా ఉండగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో అభిమాన సంఘాల అధ్యక్షులతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. జనసేన జెండాలతో బిజెపి, టిడిపి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయాలని సీమాంధ్ర 13జిల్లాల అభిమానులకు పిలుపునిచ్చారు. అంతేగాక కేంద్ర, రాష్ట్రాల్లో అవినీతి, అసమర్థ పార్టీలు గద్దెనెక్కకుండా చూడాల్సిన బాధ్యత అభిమానులపై ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications