అక్టోబర్ 2న ఆ రెండు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ శ్రమదానం
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యణ్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేస్తారు. ఛిద్రమైన రహదారులకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
అక్టోబర్ 2న ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. 2018లో పవన్ కళ్యాణ్ ఈ రోడ్డుపైనే పోరాట యాత్రలో భాగంగా కవాతు నిర్వహించిన విషయం తెలిసిందే.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే కార్యక్రమానికి హాజరవుతారు. కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి - ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపడతారు.
రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల గురించి జనసేన పార్టీ సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా ఉద్యమించిన సంగతి విదితమే. నాలుగు వారాలు గడువు ఇచ్చి వాటికి కనీసం మరమ్మతులైనా చేయాలని విజ్ఞప్తి చేసి... ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ రహదారుల విషయంలో అలక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపడతాయని పేర్కొంది.
మరోవైపు, ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా మరోసారి మండిపడ్డారు. రెండ్రోజుల క్రిందట రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌కు వచ్చి సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయాలపై కామెంట్లు చేసిన పవన్.. ఈ సారి ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశారు.
తాజాగా, అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు అమలుకావడం లేదంటూ ఫొటో రూపంలో పోస్టు చేశారు. మద్యపాన నిషేధం, ఉద్యోగాల భర్తీ, కరెంటు చార్జీలు, రాజధాని అంశం ఇలా వాగ్ధానాలన్నింటినీ ప్రస్తావిస్తూ అందులో రాసుకొచ్చారు. ఈ వాగ్దానాలన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఏ ఒక్కదాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు.
రాష్ట్రాన్ని దాదాపు 4లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసిందని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక చేపట్టిన చర్యలపై ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామన్న హామీకి భిన్నంగా పాలన సాగుతోందని విమర్శించారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications