ఏ లక్ష్యం కోసం AP ఏర్పడిందో గుర్తుచేసుకోండి: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనగానే మన మదిలో పొట్టి శ్రీరాములే గుర్తుకు వస్తారన్నారు. తెలుగు జాతి ఉనికి కోసం, వారి అభివృద్ధి కోసం ఆ పుణ్యమూర్తి ప్రాణాలు అర్పించారని కొనియాడారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగువారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేవారని, ఈ వివక్షను తట్టుకోలేకే ఆయన ఆమరణదీక్ష చేపట్టి, తెలుగువారిలో చైతన్యం తెచ్చారని, తద్వారా తన ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.
ఏపీ ప్రజల్లో ఎటువంటి చైతన్యం కోసం ఆ అమరజీవి తపించారో.. అటువంటి చైతన్యం ఈరోజు ఏపీ ప్రజల్లో ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉందని, అతలాకుతలమైపోతున్నా ప్రజల్లో ఎందుకు స్పందన కొరవడిందన్నారు.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం చేజారిపోతోందని, రాష్ట్రానికి రావల్సిన ప్రాజెక్టులు పక్క రాష్ట్రాలకు వెళుతున్నాయని, ప్రజలకు పాలకులు కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారన్నారు. ఏ లక్ష్యం కోసం ఏపీ ఏర్పడిందో అందరూ మననం చేసుకోవాలని కోరారు. అక్రమార్కులు పరిపాలన చేస్తుంటే చేష్టలుడిగి ఎన్నాళ్లు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందామని ప్రశ్నించారు.
ఏపీని దేశంలో అగ్రగామిగా నిలపాలని, శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లేలా ముందుకు సాగాలన్నారు. ఓటును ఆయుధంగా మలచాలని, గళమెత్తాలని, అప్పుడే త్యాగధనులకు త్యాగాలకు ఒక సార్థకత ఏర్పడుతుందన్నారు. ఏపీ అవతరణకు కారణభూతులైన పొట్టి శ్రీరాములుకు, యజ్ఞం కోసం కృషిచేసిన మహానుభావులకు ప్రణామాలు తెలియజేస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications