కాకినాడ రైతులకు పవన్ గుడ్ న్యూస్-నెరవేరిన మరో ఎన్నికల హామీ..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పిఠాపురం నుంచి తొలిసారి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. అప్పట్లో ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ఇందులో ఇప్పటికే చాలా వరకూ హామీలు నెరవేర్చిన జనసేనాని.. ఇవాళ మరో హామీని తీర్చేశారు. దీంతో కాకినాడ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించారు. దీంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1,551 మంది రైతులకు మేలు జరగనుంది.

కాకినాడ సెజ్ రైతుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన పవన్.. అధికారులకు కీలక ఆదేశాలు ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో రెవెన్యూ శాఖ ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కాకినాడ సెజ్ కు భూములు ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాకినాడ సెజ్ లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ లకు రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని ఆదేశాలలో పేర్కొన్నారు.

కాకినాడ సెజ్ పరిధిలో రైతులకు వెనక్కి ఇచ్చిన భూమి, తిరిగి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కాక సతమతం అవుతున్న అంశంపై పవన్ గత ఎన్నికల సమయంలో స్బందించారు. గత ప్రభుత్వంలో కాకినాడ సెజ్ భూములపై జీవో నెం.12 విడుదల అయినా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మేలు జరగలేదు. వారి పేరున రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో పిల్లలకు పెళ్లిళ్లు, చదువుల నిమిత్తం భూములు ఉపయోగపడటం లేదని రైతులు పవన్ కు గతంలో విన్నవించారు. దీనిపై పూర్తి వివరాలు పరిశీలించి, రైతులకు మేలు జరిగేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications