చూస్తుండండి- లడ్డూ కల్తీని మేమే బయట పెడతాం
పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ కాలేదంటూ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఏకంగా సీబీఐ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కల్తీ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి.
దీనిపై తాజాగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నట్లు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) నివేదిక స్పష్టం చేసిందని, ఈ నివేదికనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉదాహరించారని అన్నారు.

గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఎటువంటి భక్తి విశ్వాసాలు లేవని కేశవ్ మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీ వ్యవహారాన్ని వ్యాపారంగా చూసిందని, ఆ కోణంలోనే కల్తీ నెయ్యిని సేకరించిందని, తద్వారా కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ అవకతవకల వల్లే నాణ్యతను విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు.
2022లో మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CFTRI)కి పంపిన నెయ్యి నమూనాలు కల్తీ జరిగిందని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, గత ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు.. నెయ్యి సేకరణకు సంబంధించిన టెండర్ నిబంధనలను మార్చిందని, తక్కువ టర్నోవర్ ఉన్న చిన్న కంపెనీలకు కూడా అవకాశం కల్పించిందని కేశవ్ వివరించారు.
ఈ మార్పుల వల్ల నాణ్యత లేకుండా పోయిందని చెప్పారు. నెయ్యి కల్తీ వ్యవహారం రూ. 240 కోట్ల కుంభకోణమని సిట్ తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొందని పయ్యావుల తెలిపారు. అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు డెయిరీ కంపెనీల నుండి రూ. 4 కోట్లు తీసుకున్నారని, ఆ డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించారని ఆరోపించారు. వీటన్నింటినీ కూడా తాము వెలికి తీస్తామని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అక్రమాలన్నింటినీ బయటపెడతామని అన్నారు.












Click it and Unblock the Notifications