'జగన్ చీర్‌గర్ల్స్ పాత్ర: కాపురమిక్కడ, డ్యూయెట్ అక్కడ'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసన సభ్యుడు పయ్యావుల కేశవ్ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమైక్య క్రికెట్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీది చీర్ గర్ల్స్ పాత్ర అని విమర్శించారు. టిడిఎల్పీలో పయ్యావుల విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెసు పార్టీతో వైయస్ జగన్మోహన్ రెడ్డికి విడదీయరాని బంధం ఉందని, సమైక్య ఉద్యమంలో జగన్ పార్టీది చీర్ గర్ల్స్ పాత్ర అని ఎద్దేవా చేశారు. సమైక్యవాదంపై రాష్ట్రపతికి అఫిడవిట్ ఇవ్వాలంటున్న వైయస్ జగన్ మొదట తాను కాంగ్రెసు పార్టీతో కలిసేది లేదని ప్రతి గడపకు అఫిడవిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జగన్ కాంగ్రెసు పార్టీతో కాపురం చేస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో డ్యూయెట్లు పాడుతూ, భారతీయ జనతా పార్టీతో సహజీవనానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయ విలువల గురించి మాట్లాడుతుంటే సీతాదేవి, సతీ సావిత్రిల పవిత్రతకు చింతామణి సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఉందన్నారు.
జగన్, కెసిఆర్ కలిసి బహిరంగ చర్చకు వస్తే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ వాదో తేల్చడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సోనియాను చూసే జగన్ స్పీకర్ వెల్‌లోకి వెళ్లలేదని, సోనియా అంటే జగన్‌కు అంత భయమెందుకో చెప్పాలన్నారు. కాంగ్రెసు అధఇనేత్రిని చూస్తేనే జగన్‌కు వణుకు అన్నారు.












Click it and Unblock the Notifications