కెసిఆర్ రావడం బాబు చాణక్యనీతి, జగన్ భస్మాసురుడు: పయ్యావుల
విజయవాడ: అమరావతి శంకుస్థాపనకు పిలవొద్దంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నిత్యం విరుచుకుపడుతున్నారు. రాజధాని శంకుస్థాపన పనులను పర్యవేక్షిస్తున్న పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి బుధవారం మీడియా వద్ద జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ కలియుగ భస్మాసురుడని, జగన్ చేతిని తననెత్తినే పెట్టుకుంటున్నారని పయ్యావుల విమర్శించారు. శంకుస్థాపనకు కేసీఆర్ రావడం చంద్రబాబు చాణిక్యతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. విద్వేషాలు మర్చిపోయి కలిసి పయనించడమే తెలుగుజాతి ముందున్న లక్ష్యమని అన్నారు.
శంకుస్థాపనకు జగన్ రాకపోవడం దురదృష్టకరమని ధూళిపాళ్ల అన్నారు. విపక్ష నేతగా జగన్ పనికిరారని ఆయన చెప్పారు. కేటీఆర్‌కు ఉన్న తెలివి కూడా జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మోదీ ఆదుకుంటారన్న నమ్మకం ఉందని ధూళిపాళ్ల ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఏపీ కాంగ్రెస్ పార్టీని చూసి జనం నవ్వుకుంటున్నారని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నగరం అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజాలు వస్తుంటే జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తాము రామని భీష్మించుకుని కూర్చోవడంపై జనం నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన వేదిక వద్ద ప్రధానితో నేరుగా కలిసి మాట్లాడే అవకాశం జారవిడుచుకుని ఇప్పుడు ప్రత్యేక హోదాపై లేఖను గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇస్తామంటూ అభ్యర్థించడం విడ్డూరంగా ఉందని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి తాము రామని కూర్చున్న వైసీపీ, మరి అమరావతిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు వస్తారో, రారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధాని నిర్మాణానికి రైతులంతా స్వచ్చందంగా తమ భూములను దారాదత్తం చేస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల వద్ద భూములు లాక్కొన్నారని చెప్పడం హాస్యస్పదమని అన్నారు. శంకుస్థాపనకు రావడం ఇష్టంలేకపోతే మౌనంగా ఉండాల్సిందిపోయి బహిరంగ లేఖలు ఇవ్వడం జగన్ మోహన్ రెడ్డికే చెల్లిందంటూ విమర్శించారు.












Click it and Unblock the Notifications