బోడిగుండు పీఆర్సీ: వైఎస్ జగన్ తెరవెనుక నాటకం: ఎమ్మెల్సీలు
అమరావతి: ఏపీ ప్రభుత్వం- ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకుక దారి తీసిన పీఆర్సీ వివాదానికి తెర పడింది. ఉద్యోగ సంఘాల నాయకులు- ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో సాగించిన చర్చలు సఫలం అయ్యాయి. దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ చర్చలు ఫలించాయి. ప్రతిపాదిత సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, వాటిని పరిష్కరించడానికి అంగీకరించిందని అన్నారు.

హెచ్‌ఆర్ఏ పెంపుతో..
ముఖ్యంగా హెచ్ఆర్ఏను పెంచడం, సీసీఏ కొనసాగింపు, అదనపు క్వాంటమ్ పింఛన్‌ను 70 సంవత్సరాలకు అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిట్‌మెంట్ 23 శాతం కంటే ఎక్కువ చేయాలన్న డిమాండ్‌కు మాత్రం ప్రభుత్వం నిరాకరించింది. ఐఆర్ రికవరీ చేయకూడదని, అయిదేళ్లకోసారి పీఆర్సీ విధానం కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను మంత్రుల కమిటీ అంగీకరించింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని పొడిగించడానికీ అంగీకరించింది.

ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత..
ఇకపై 10 శాతం, 12 శాతం మేర నాలుగు హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను అమలు చేస్తామంటూ మంత్రుల కమిటీ చేసిన ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాల నాయకులు అంగీకరించారు. సమ్మె ప్రతిపాదనలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వంతో ప్రతిపాదిత సమ్మెను ఉపసంహరించుకునేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తోన్నాయి. డిమాండ్ల పరిష్కారం కోసం తమతో కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమిస్తామని స్పష్టం చేశాయి.

పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆగ్రహం..
ఈ పీఆర్సీపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఘాటుగా స్పందించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులను ఒప్పించి, ఉద్యోగులను ముంచేసిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ మండిపడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బొచ్చులో పీఆర్సీ, వైసీపీ హయాంలో బోడిగుండు పీఆర్సీ అంటూ విమర్శించారు.

అధ్వాన్నమైన పీఆర్సీ..
ఇంత అధ్వానమైన పీఆర్సీ తాము ఎప్పుడూ చూడలేదని ఇళ్ల వెంకటేశ్వర రావు అన్నారు. సమ్మెను విరమింపజేయడానికే మంత్రులు, అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపారని, వారి ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి తెరవెనుక ఉండి మంత్రులు, అధికారుల కమిటీతో నాటకం ఆడించారని విమర్శించారు. పీఆర్సీ ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని మిగిలిచిందని ధ్వజమెత్తారు.

చట్టబద్ధత లేని నివేదికకు ఆమోదం ఎలా..
ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏ, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఇతర ఆర్థిక ప్రయోజనాలతో పాటు అంత్యక్రియల కోసం చెల్లించే మొత్తాన్ని కూడా తగ్గించడం దారుణమని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అశుతోష్ మిశ్రా అందజేసిన పీఆర్సీ నివేదికను పక్కన పెట్టి చట్టబద్ధత లేని రిపోర్ట్‌కు అంగీకారం తెలపడం సరికాదని చెప్పారు. పీఆర్సీ చర్చల్లో సీపీఎస్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సచివాలయ ఉద్యోగుల ప్రస్తావన ఎందుకు తీసుకుని రాలేకపోయారని ఉపాద్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రశ్నించారు.

మెరుగైన పీఆర్సీ కోసం..
మెరుగైన పీఆర్సీ కోసం ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించే అన్ని రకాల పోరాటాలకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. శాసన మండలిలో వారి గళాన్ని వినిపిస్తామని భరోసా ఇచ్చారు. మండలి లోపల, బయటా వారికి అండగా ఉంటామని అన్నారు. మెరుగైన పీఆర్సీని సాధించేంత వరకూ విశ్రమించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పరమైన ఒత్తిడిని తీసుకొచ్చి- పీఆర్సీని పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications