నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణపట్నం జనసంద్రం-ఆనందయ్య కరోనా మందుకు విపరీత డిమాండ్-అల్లోపతి వైద్యుల విమర్శలు పట్టించుకోని జనం

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనాకు విరుగుడుగా పనిచేస్తోందన్న ప్రచారం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో జనాలు పిట్టల్లా రాలిపోతున్న వేళ ఆనందయ్య మందు అద్భుతంగా పనిచేస్తోందని దాన్ని వాడినవారు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా తండోపతండాలుగా వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి జనం పోటెత్తుతున్నారు. జనం ఇంతలా ఆ మందు కోసం ఆరాటపడుతుండటంతో ప్రభుత్వం సైతం దానిపై ఫోకస్ చేయక తప్పలేదు. స్థానిక అధికార యంత్రాంగంతో ఆ మందుపై నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం... దాని పంపిణీకి అధికారికంగా అనుమతినిచ్చింది.

Recommended Video

#Krishnapatnam Ayurveda మందు తయారీ విధానం | Ingredients | Herbal Drug || Oneindia Telugu
ఇసుకేస్తే రాలనంత జనం.. రెండు రోజులు బ్రేక్...

ఇసుకేస్తే రాలనంత జనం.. రెండు రోజులు బ్రేక్...

కరోనా వ్యాధికి విరుగుడుగా ఆనందయ్య ఇస్తున్న మందుపై లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో మందు పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆ తర్వాత కలెక్టర్ ఇచ్చిన నివేదికతో అడ్డంకులు తొలగిపోయాయి. శుక్రవారం(మే 21) ఉదయం వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీని పున:ప్రారంభించారు. దాదాపు 3వేల మందికి మందును పంపిణీ చేశారు. కానీ అప్పటికే అక్కడికి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ జనాన్ని పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. అంత మంది జనానికి ఒక్కరోజులో మందు ఇవ్వడం అసాధ్యం అంటున్నారు. ఇప్పటికే ఉన్న మూలికలన్నీ అయిపోవడంతో రెండు రోజుల పాటు మందు పంపిణీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

గ్రామల్లో పంపిణీకి ఏర్పాట్లు...

గ్రామల్లో పంపిణీకి ఏర్పాట్లు...

ఏపీతో పాటు పొరుగునే ఉన్న తమిళనాడు,కర్ణాటక,తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కృష్ణపట్నంకు జనం పోటెత్తుతున్నారు. కృష్ణపట్నంకు వెళ్లే ముత్తుకూరు రోడ్డు మార్గం కి.మీ మేర వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఆయుర్వేద మందుకు వెల్లువెత్తుతున్న ఈ స్పందన చూసి ప్రభుత్వ యంత్రాంగమే షాక్‌కి గురవుతోంది. ఇప్పుడున్న డిమాండ్‌కి తగినట్లు మందును సప్లై చేయాలంటే ఆనందయ్యకు ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఇప్పటివరకూ ఆయన తన సొంత ఖర్చులతో ఉచితంగా ఈ మందును అందిస్తూ వచ్చారు. కానీ వెల్లువలా వస్తున్న ఇంత మంది జనానికి మందు పంపిణీ చేయాలంటే భారీ ఎత్తున ముడిసరుకు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆనందయ్యకు సహకరించనుంది. అలాగే కరోనా వేళ ఇంతలా పోటెత్తుతున్న జనాన్ని నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోనే ఈ మందు పంపిణీ చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ వెల్లడించారు.

ఆనందయ్య మందుపై జనం విశ్వాసం...

ఆనందయ్య మందుపై జనం విశ్వాసం...

నిజానికి గత ఏడాది కాలంగా ఆనందయ్య కరోనాకు ఆయుర్వేద మందు అందిస్తున్నాడు. మొదట్లో కృష్ణపట్నం,పరిసర గ్రామాలకే ఇది పరిమితమైంది. సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య పెరగడం,చాలామంది సీరియస్‌గా ఉన్న పేషెంట్లు సైతం ఈ మందు వాడి కోలుకోవడంతో ఆనందయ్య పేరు మారు మోగింది. ఆ నోటా ఈ నోటా ఆయన పేరు రాష్ట్రాలు దాటింది. దీంతో జనం తండోపతండాలుగా ఆయన వద్దకు వెళ్తున్నారు. కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షల్లో ఫీజులు కట్టినా బతుకుతామన్న గ్యారెంటీ లేదని... ఆనందయ్య ఉచితంగా ఇచ్చే మందు తమ ప్రాణాలను కాపాడుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ మందు తీసుకున్నాక శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని చెబుతున్నారు.

కలెక్టర్ నివేదికతో గ్రీన్ సిగ్నల్...

ఆనందయ్య మందుకు విపరీతమైన డిమాండ్ నెలకొనడం... జనం ఇంతలా పోటెత్తుతున్న నేపథ్యంలో ఆ మందు శాస్త్రీయమైనది కాదని లోకాయుక్తలో కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆధ్వర్యంలో పలువురు అధికారులు దీనిపై విచారణ జరిపారు. ఈ మందు వాడినవారిలో ఇప్పటివరకూ ఎవరికీ సైడ్ ఎఫెక్ట్స్ లేవని నివేదిక ఇచ్చారు. చాలామంది కోలుకున్నారని,ఆక్సిజన్ లెవల్స్ కూడా పెరిగాయని చెబుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందన్నారు. కలెక్టర్ పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రభుత్వం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అల్లోపతి వైద్యుల విమర్శలు.. పట్టించుకోని జనం..

అల్లం,తాటి బెల్లం,తేనె,నల్ల జీలకర్ర,తోక మిరియాలు,పట్టా,లవంగాలు,వేప ఆకులు,నేరెడు చిగుర్లు,మామిడి చిగుర్లు,నేల ఉసిరి చెట్టు,కొండ పల్లేరు కాయల చెట్టు,ముళ్ల వంకాయలు,పిప్పింట ఆకుల చెట్టు,బుడ్డ బుడస ఆకులు,తెల్ల జిల్లేడు పూల మొగ్గలతో ఆనందయ్య ఈ ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేస్తున్నారు. అయితే ఇది మందు కాదని అల్లోపతి వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకు కూరలు తినిపించి అదే మందు అని నమ్మిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇది ప్రజలను మూఢత్వంలోకి నెట్టడమేనని... దీనికి శాస్త్రీయత ఏముందని ప్రశ్నిస్తున్నారు. దానివల్ల ఇతర సమస్యలేవైనా తలెత్తితే ఎవరిది బాధ్యత అని నిలదీస్తున్నారు. ప్రజలు మాత్రం ఆ విమర్శలేవీ పట్టించుకోవట్లేదు. నెల్లూరు జీజీహెచ్‌లో కోవిడ్ వార్డు పూర్తిగా ఖాళీ అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరంతా ఆస్పత్రిని వీడి కృష్ణపట్నంలో మందు కోసం వెళ్లారు. ఈ ఒక్కరోజే కృష్ణపట్నానికి 50వేల నుంచి 60 వేల మంది జనం వెళ్లి ఉండవచ్చునని అంటున్నారు. ఒకరకంగా ఇది థర్డ్ వేవ్‌కు దారితీసే ప్రమాదం లేకపోలేదని పలువురు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

English summary
At a time when the world sees modern medicine as the answer to the Covid-19 crisis, thousands of people from different states are in queue line for a ayurveda medicine in Krishnapatnam,in Nellore district.Anandayya who is practicing ayurveda from last few decades,here he is giving the medicine at no charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X