తొలి ఏడాదిలోనే రూ.1.61 లక్షల కోట్ల అప్పులు ఏం చేశారో ప్రజలకు తెలియజేయండి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు సంధించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏడాది పాలనంతా దోపిడి, అబద్ధాల మయం అని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలకు మిగిలింది వంచన, మోసం మాత్రమేనని ఆరోపించారు. ప్రభుత్వం ఎప్పుడూ చెప్పేవి గొప్పలు కాగా, చేసేది అప్పులు మాత్రమేనని, అదే పనిగా ఈవెంట్ల నిర్వహణ, ఆర్భాటంగా ప్రచారం తప్ప, ఈ ప్రభుత్వం ఈ ఏడాదిలో ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు.

కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా అంటూ సచివాలయం వద్ద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారని, ఇందులో ఎన్నికలకు ముందు చెప్పిన అబద్ధాలనే మళ్లీ చెప్పుకొచ్చారని పేర్ని నాని గుర్తు చేశారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ముగ్గురూ కలిసి ఆత్మస్తుతి, పరనిందతో పాటు, పరస్పర డబ్బాతో గడిపేశారని ఎద్దేవా చేశారు. దీనికి కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లలా ఖర్చు చేశారని పేర్కొన్నారు. కనీసం ఒక్క సంక్షేమ పథకం అందించకుండా ఏడాదిలోనే 1.61 లక్షల కోట్ల రూపాయలకుపైగా అప్పులు చేస్తూ గుడ్ గవర్నెన్స్ అందించామని అలవోకగా పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
2022- 23 ఏడాదిలో వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అప్పులతో దివాళా తీసిందని ప్రచారం చేశారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు, నారా లోకేష్ కు సవాల్ విసిరారు. తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రూ.1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, ఈ మొత్తాన్ని ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.
యోగాంధ్ర పేరుతో ఒకరోజు ఈవెంట్ మ్యాట్లకు రూ.350 కోట్లు ఖర్చు చేశారని పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. ముగ్గురూ విలాసాల కోసం ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరుగుతున్నారని, ప్రత్యేక విమానం కొనుగోలు చేస్తున్నారని అన్నారు. తమ సొంత డబ్బులు కొనుగోలు చేయాల్సి వస్తే ఈ విధంగా తిరుగుతారా? అని నిలదీశారు.
సంపద సృష్టిస్తామని ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు రూ.1.61 లక్షల కోట్లు అప్పులు చేశారని పేర్నినాని అన్నారు. ఆడబిడ్డ నిధి, దీపం, ఉచిత బస్సు, తల్లికి వందనం పథకాల పేరుతో ఓటేయించుకుని మహిళలను దారుణంగా వంచించారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బాండ్లకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మహిళలు, బాలికల మీద వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హోంమంత్రి అనితలో ఎవరూ ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్ పెట్టి స్పందించిన పాపాన పోలేదని పేర్నినాని విమర్శించారు. ఏ ఒక్క నిందితుడి మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు.
వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధించడానికే పోలీసులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. సుగాలి ప్రీతి కేసుతో విపరీతంగా ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్, ఏడాది గడిచినా దాని గురించి పట్టించుకోలేదని, చివరికి తన నియోజకవర్గం పిఠాపురంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా పవన్ కళ్యాణ్‌కి చీమకుట్టినట్టయినా అనిపించడం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications