ఏకే 47 గ్రేహౌండ్స్ నుండి మిస్, తెలియదని నిత్యానంద

ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఈ సంఘటన జరిగిందన్నారు. నిత్యానంద రెడ్డి తన సోదరుడితో కలిసి వాకింగ్‌కు వచ్చారని తెలిపారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న కారులో నిత్యానంద రెడ్డి కూర్చున్నారని, ఆ సమయంలో తన కారులో కూర్చున్నఅగంతకుడిని గుర్తించి.. అతనిని ప్రశ్నించే ప్రయత్నం చేశాడని తెలిపారు. అంతలోనే నిత్యానంద రెడ్డి తమ్ముడు వచ్చారని, వారి మధ్య పెనుగులాట జరిగిందన్నారు. ఆ సమయంలో వెపన్స్ ఫైరింగ్ అయిందన్నారు.
అగంతకుడు వాడిన ఏకే 47 ఆయుధం గురించి మాట్లాడుతూ.. ఇది గ్రేహౌండ్స్‌కు చెందిన ఆయుధమని చెప్పారు. గత డిసెంబర్ నెలలో ఇది అదృశ్యమైందని చెప్పారు. మిగతా విషయాలు తొందరలో బయటపడతాయన్నారు. అగంతకుడు దొరికితే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
గ్రౌహండ్స్‌కు చెదిన ఆయుధం ఎవరు తీశారో.. వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును త్వరలో చేదిస్తామనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. మిగతా విషయాలు విచారణలో బయటపడతాయని చెప్పారు. విచారణ జరిపి విలేకరులకు చెబుతామన్నారు.
నిత్యానంద రెడ్డి కారులో కూర్చున్న అగంతకుడు పక్కన అప్పటికే ఓ బ్యాగు ఉందని, అతను దాంతో వచ్చాడని తెలిపారు. ఆ బ్యాగులోనే ఆయుధం ఉందని చెప్పాడు. కాగా, కేబీఆర్ పార్క్ నిత్యానంద రెడ్డి పైన అగంతకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఘటన స్థలంలో 8 బులెట్ షెల్స్ లభించాయి. అగంతకుడి కాల్పులతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు రావడంతో అతను పరారయ్యాడు. నిత్యానంద రెడ్డి పైన ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపాడు.
నాకు ఎవరితో శతృత్వం లేదు: నిత్యానంద రెడ్డి
తనకు ఎవరితోను శతృత్వం లేదని నిత్యానంద రెడ్డి తెలిపారు. కాల్పులు జరిపింది ఎవరో తనకు తెలియదన్నారు. అగంతకుడికి సుమారు 30 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. తన వెనకాలే కారులో ఎక్కి తుపాకీ గురి పెట్టాడని తెలిపారు. కాగా, నిత్యానంద రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తు పడతానని కూడా నిత్యానంద రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది.
డ్రైవర్ లేకుండానే వచ్చాడు
నిత్యానంద రెడ్డి డ్రైవర్ లేకుండానే పార్క్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ ఘటన పైన పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ భవన్ వద్ద ఉన్న కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మిస్సైన తుపాకి విషయమై జనవరిలో కేసు
మిస్సైన తుపాకీ పైన గత జనవరిలో నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదయినట్లుగా తెలుస్తోంది. మిస్సైన గన్ ఎవరి చేతుల్లోకి వెళ్లిందనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. కిరాయి హంతకుల చేతుల్లోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. సస్పెండైన గ్రేహొండ్స్ పోలీసులను విచారించనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications