కిషన్ ధర్నా, కేసీఆర్‌పై పైర్: టీడీపీ ఆఫీస్‌పై తెరాస దాడి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాకు దిగారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కిషన్ రెడ్డి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. విద్యుత్ సరఫరా విషయంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా తెరాస పాలన ఉందన్నారు. సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
కరెంట్ కోతలతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత జిల్లాలోని ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతుల ఆత్మహత్యలను అరికట్టే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చడం లేదన్నారు.

ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని హామీలు గుప్పించారని, ఇప్పుడు విద్యుత్ కోతలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. విద్యుత్ విషయంలో యుద్ద ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నల్గొండలో టీడీపీ కార్యాలయంపై తెరాస కార్యకర్తల దాడి
నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంపై తెరాస కార్యకర్తలు మంగళవారం దాడికి పాల్పడ్డారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ కృష్ణా రివర్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తెరాస కార్యకర్తలు ఒక్కసారిగా టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసులో ఫర్నీచర్‌కు కిరోసిన్ పోసి నిప్పంటించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో కార్యాలయంలోని ఫర్నీచర్, కిటీకీ అద్దాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. కార్యాలయం ఎదుట బైఠాయించిన తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
గవర్నర్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం టీపీసీసీ చీప్ పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. తెరాస ప్రభుత్వ హయాంలో 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ అందలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపులేదని పొన్నాల ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై సీఎంతో మాట్లాడుతానని గవర్నర్ చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రపతి పాలన సమయంలో తెలంగాణకు కరెంటు కష్టాలు లేకుండా చేశానని గవర్ననర్ చెప్పారని పొన్నాల వెల్లడించారు.












Click it and Unblock the Notifications