ఫొటో: రక్తి కట్టిన నన్నపనేని ఆత్మహత్య డ్రామా

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పా్రటీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి శాసనస మండలి ఆవరణలో ఆత్మహత్య డ్రామా వేశారు. ఈ డ్రామా రక్తికట్టించింది. మరణించినట్లుగా ఆమె పడుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిగా నన్నపనేని నటించారు. ఆత్మహత్య చేసుకున్న శవం పక్కన ఏడుస్తోన్న వ్యక్తిగా అదే పార్టీకి చెందిన మరో సభ్యురాలు శమంతకమణి నటించారు.
అన్నదమ్ముల మాదిరిగా ఉన్న తెలుగు జాతి మధ్య సోనియాగాంధీ చిచ్చు పెట్టిందని శమంతకమణి శాపనార్థాలు పెడుతున్నట్టు నటించారు. ఇద్దరు మహిళ సభ్యుల ఆత్మహత్య నాటకాన్ని సభ్యులంతా గుమిగూడి తిలకించారు. ఆ తర్వాత నన్నపనేని నాటకం ముగిసిన తర్వాత, ఆమెతో కాంగ్రెసు సభ్యుడు భానుప్రసాద్, ఫారుఖ్ హుస్సెన్ వాదనకు దిగారు. తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చి, టిడిపి ఎందుకు నాటకాలు ఆడుతుందని వారు ప్రశ్నించారు.
మీకు రాష్ట్రం వచ్చిందన్న ఆనందం ఉంది, కానీ తమకు సమస్యలు వస్తాయన్న ఆందోళన ఉందని నన్నపనేని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వారే తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి చాలు అని నన్నపనేని వాదించారు. ముఖ్యమంత్రి పదవిదాక ఎందుకు, టిడిపి అధ్యక్ష పదవిని తెలంగాణవారికి ఇవ్వమని చంద్రబాబుకు చెప్పండి, ఇచ్చాక మాట్లాడుదామని భానుప్రసాద్ ప్రతివాదనకు దిగారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని చెప్పించండి, తాము చంద్రబాబుకు చెప్పి ఒప్పిస్తామని నన్నపనేని, శమంతకమణి వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని కాంగ్రెసు సభ్యులు భానుప్రసాద్, ఫారుఖ్ హుస్సెన్ వారిని ప్రశ్నించడంతో, తాము కాదు మోసం చేస్తున్నది కాంగ్రెస్సేనని నన్నపనేని, శమంతకమణి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నన్నపనేని నాటకం ముగిసింది.












Click it and Unblock the Notifications