జైత్రయాత్ర: జగన్, కిరణ్‌లపై టీ నేతల అటాక్ (పిక్చర్స్)
మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నేతలు జైత్రయాత్ర సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి బహిరంగ సభ నిజామాబాద్‌లో జరగగా, రెండో సభను మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలలో సోమవారం నిర్వహించారు.
ఈ సభలో తెలంగాణ కాంగ్రెసు నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యం చేసుకుని వాగ్బాణాలు సంధించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కొద్ది మంది నాయకులు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమ వల్లనే సాధ్యమైందని, తెరాస వల్ల సాధ్యం కాలేదని చెప్పడానికి ప్రయత్నించారు.
తెలంగాణ కాంగ్రెసు నేతలు సంఘటితంగా వ్యవహరించారు. సీమాంధ్ర ప్రజలకు సోనియా గాంధీ అన్యాయం చేయరని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. సోనియాకు సానుభూతి ఉందని చెప్పారు. సోనియాపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసును విమర్సించడానికి జగన్ వయస్సు ఎంత అని అడిగారు.

కలిసి బయలుదేరారు
మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల జైత్రయాత్ర సభకు కాంగ్రెసు నాయకులు ఇలా కలిసికట్టుగా బయలుదేరారు. మంత్రులు జానారెడ్డి, డికె అరుణ బస్సులో ఇలా కనిపించారు.

సమస్యలు వస్తే వారిదే బాధ్యత
రాష్ట్ర విభజన వల్ల సమస్యలు తలెత్తితే బాధ్యత సీమాంధ్ర నాయకులదేనని డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సీమాంధ్రులు రాష్ట్ర విభజనకు సహకరించాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య కోరారు.

విభేదాలు పక్కన పెట్టి..
విభేదాలు పక్కన పెట్టి నల్లగొండ జిల్లా నాయకులు ఒకే బస్సులో ప్రయాణించారు. పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, శాసనసభ్యుడు ఆర్ దామోదర రెడ్డి ఒకే బస్సులో గద్వాల యాత్రకు బయలుదేరారు.

ముగ్గురిపై మండిపాటు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను నమ్మిన మాజీ మంత్రి కొండా సురేఖ వంటి వారిని నట్టేట ముంచారని మంత్రి డికె అరుణ మంగళవారం మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో కాంగ్రెసు పార్టీ జైత్రయాత్ర సభను నిర్వహించింది. ఇందులో డికె అరుణ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్ జగన్‌ల పైన ఆమె మండిపడ్డారు.

ఎంత మంది నాయకులో...
తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోనియాకు ధన్యవాదాలు చెప్పడానికి వేదిక మీద క్రిక్కిరిసి కూర్చున్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా వ్యవహరించారు.

జగన్‌పై విహెచ్ ఫైర్
తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ది ఏ టర్నో తెలియడం లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నాడని ఆయన అన్నారు.

సభకు వచ్చిన జనం..
గద్వాల జైత్రయాత్ర సభకు పెద్ద యెత్తునే ప్రజలు వచ్చారు. సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెసు నాయకులు కాంగ్రెసును బలోపేతం చేసేందుకు జైత్రయాత్ర సభల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

వెళ్లాలని చెప్పడానికి జగన్ ఎవరు
అరవై ఏళ్ల తెలంగాణ కల సోనియా వల్లనే నెరవేరిందని కాంగ్రెసు మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు .తెలంగాణ కాంగ్రెసు నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు. సోనియా ఇక్కడి కోడలు, వెళ్లాలని అనడానికి జగన్ ఎవరని ఆయన అడిగారు. ఒకరిద్దరు ఎంపీలు ఉన్న పార్టీలు తెలంగాణను అడ్డుకోలేవని ఆయన అన్నారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు
తెలంగాణ జైత్రయాత్ర కోసం బస్సులో వెళ్తూ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ఇలా...

ఏదేదో మాట్లాడుతున్నారు...
తెలంగాణకు అనుకూలంగా మొదట లేఖలు ఇచ్చినవారిలో ఇప్పుడు ఒక్కరు సమైక్యమని, మరొకరు సమన్యాయమని మాట్లాడుతున్నారని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి జగన్, చంద్రబాబులను విమర్సించారు. సోనియా నిర్ణయాన్ని సీమాంధ్ర నాయకులు వ్యవహరించడం సరి కాదని ఆమె అన్నారు.

సిఎంను తప్పు పట్టిన డిఎస్
తుఫానును ఆపలేకపోయినా విభజనను అపుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిఎస్ తప్పు పట్టారు. సోనియా భిక్ష వల్లనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, విభజన నిర్ణయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణ కచ్చితంగా ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు.

అనుమానాలు అక్కర్లేదన్న జానా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏ విధమైన అనుమానాలు అక్కర్లేదని రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని చెప్పడం అవగాహనా లోపమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల్లో అపోహలు అవసరం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications