అర గంటలో గూటికి చేరేవారే, ఇంతలోనే సజీవ సమాధి (పిక్చర్స్)
రాజమండ్రి: మరో అరగంటలో ఇళ్లకు చేరుతామనే లోగా రోడ్డు ప్రమాదం వారిని మింగేసింది. నిద్ర మాయ చేసి పరలోకానికి పంపించింది. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిలించింది. పలు కుటుంబాలు పెద్దలను కోల్పోయి దిక్కు మొక్కు లేవిని అయ్యాయి.
19 రోజుల పాటు తమవారి కోసం కాయకష్టం చేసి, అంతో ఇంతో సంపాదించిన సొమ్ముతో ఆనందంగా స్వస్థలానికి బయలుదేరి, కేవలం అర్ధగంటలో ఇంటికి చేరేలోగా దురదృష్టం లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. శంఖవరం, తొండంగి, ప్రత్తిపాడు, రౌతులపూడి గ్రామాలకు చెందిన కూలీలు వలసవెళ్లిపోయారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 2గంటలకు జరిగిన ఈ సంఘటనలో 18 మంది వలస కూలీలు ప్రాణాలను కోల్పోయారు.
మెట్ట ప్రాంతంలో పనులు దొరక్క, దొరికిన ఉపాధి హామీ పనుల వల్ల కుటుంబ పోషణకు అవసరమైన కనీస ఆదాయం లభించక గత్యంతరం లేని పరిస్థితుల్లో 19రోజుల క్రితం జిల్లాలోని మెట్ట ప్రాంతానికి చెందిన నాలుగు మండలాలకు చెందిన కూలీలు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని చాట్రాయి గ్రామం వలస వెళ్లారు.

ఇంటికి వెళ్లాలనే ఆతురతతో..
కుటుంబాలకు దూరంగా ఉన్నప్పటికీ, అంతో ఇంతో సంపాదించుకుని ఆనందంగా ఇంటికి వెళ్లాలన్న తొందరలో ఏలూరు బైపాస్ రోడ్డులో లారీ ఎక్కారు. లారీ ఎక్కేటప్పుడే ఎందుకో ఈ బడుగు జీవులకు అనుమానం వచ్చింది. క్షేమంగా తీసుకుని వెళ్తావా అని డ్రైవర్‌ను అడిగారట.

భరోసా ఇచ్చిన డ్రైవర్
ఇద్దరం డ్రైవర్లం ఉన్నామని, మీ ప్రాణాలకేం భయం లేదని అని డ్రైవర్ జోగి శ్రీను చాలా ధైర్యంగా చెప్పాడు. డ్రైవర్ మాటలు విని ధైర్యంగా లారీ ఎక్కిన కష్టజీవులు గండేపల్లి దగ్గరకు వచ్చే సరికి నిర్జీవులుగా తయారయ్యారు.

ఓసారి అప్రమత్తం చేశారు..
గండేపల్లి గ్రామానికి చేరక ముందే లారీ డ్రైవర్‌ను నిద్ర ఆవహించిందని, కన్నుమూతపడటం మొదలవుతున్న సమయంలోనే లారీ మార్జిన్ దిగి పక్కకు వెళుతున్నపుడే కొంత మంది కూలీలు గ్రహించి అప్రమత్తమయ్యారు.

అలసిసొలసి నిద్ర
19 రోజుల పాటు కాయకష్టంతో అలసిపోయిన కూలీలు చాలా మంది గాఢ నిద్రలో ఉండటంతో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేక, తప్పించుకోలేకపోయారు. చివరకు 18 మంది మృత్యు వాతపడ్డారు.
మరో 10మంది రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో స్వల్పగాయాలతో చేరి చికిత్స పొందారు. రాత్రికి వీరంతా ఇళ్లకు వెళ్లిపోయారు.

మృతుల కుటుంబాలకు గుండె కోత..
మృతి చెందిన 18 మందిలో తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటన తీవ్రంగా కలచివేసింది. గొల్లపల్లి సత్యనారాయణ, ఆయన పెద్ద కొడుకు దొరబాబు, చిన్న కొడుకు మణికంఠ ఇద్దరూ లారీ ప్రమాదంలో ఉన్నారు. చిన్న కొడుకు మణికంఠ ప్రాణాలతో బయటపడినప్పటికీ, తండ్రి కొడుకులు మాత్రం మరణించారు.

దిక్కులేనివారయ్యారు..
కుటుంబానికి ప్రధాన ఆధారమైన వారే ఈ ప్రమాదంలో మరణించటంతో మృతుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. వెలుగుల సత్యనారాయణ అనే కూలీ అయితే తనను తాను రక్షించుకుంటూ, మరో ఇద్దర్ని రక్షించారు.

ఎఎస్ఐ చూస్తుండగానే..
గండేపల్లి ఎఎస్‌ఐ ఎ వరహాలరాజు రాత్రి పూట గస్తీ తిరుగుతున్న సమయంలో కొంచెం దూరంగా చూస్తుండగానే లారీ ప్రమాదం జరిగింది. దాంతో వెంటనే ఆయన మిగిలిన సిబ్బందిని హుటాహుటిన రప్పించి సహాయక చర్యలు చేపట్టారు.

అందరినీ ఆపేసి..
జాతీయ రహదారిపై ఆ సమయంలో వెళుతున్న లారీలు, బస్సులను పోలీసులు ఆపి, వాటిలో ప్రయాణించే వారిని కూడా సహాయక చర్యల్లో పాల్గొనేలా ఎఎస్‌ఐ వరహాలరాజు, గండేపల్లి పోలీసులు చేసారు.

చూస్తుండగానే...
కొంతమంది కళ్ల ముందే కాళ్లూ చేతులూ కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతున్నా ఏమీ చేయలేక తీవ్ర వేదన అనుభవించామని ఎఎస్‌ఐ వరహాల రాజు చెప్పారు. సంఘటన సమాచారం అందుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం వేగంగా స్పదించారు.

వేగంగా పోస్టుమార్టం..
పోస్టు మార్టం చేసేందుకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు పక్కా ఏర్పాట్లు చేయటంతో 16మృతదేహాలకు పోస్టుమార్టం చాలా వేగంగా పూర్తయింది. సంఘటనా స్థలంలో కలెక్టర్ అరుణ్‌కుమార్ తెల్లవార్లూ ఉండి పర్యవేక్షిస్తే, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, సబ్‌కలెక్టర్ విజయరామరాజు దగ్గరుండి అన్ని ఏర్పాట్లూ చేశారు.

హుటాహుటిన మంత్రులు..
మంత్రులు చినరాజప్ప, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు రాజమండ్రిలో మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారిని పరామర్శిస్తే, సంఘటనాస్థలానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపి తోట నరసింహం, జడ్పీ ఛైర్మన్ నామన చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ప్రతిపక్ష నేతలు కూడా..
తూర్పు గోదావరి జిల్లా వైసిపి అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్ తదితరులు రాజమండ్రి ప్రభుత్వాసుత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.

ఎమ్మెల్యేలు ఇలా...
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాసుపత్రిలో మృతుల కుటుంబాలను, గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

వైయస్ జగన్ వెంటనే...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు మృతుల కుటుంబాలకు పదేసి లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిచాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications