ఎవరెస్టుపై తెలంగాణ జెండా కూడా: పూర్ణిమ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంపై జాతీయ పతాకంతో పాటు తెలంగాణ జెండాను కూడా ఎగురవేశానని ఎవరెస్ట్ ఎక్కిన అత్యంత పిన్న వయస్కురాలు మలవత్ పూర్ణ తెలిపింది. బుధవారం ఏపీ భవన్ చేరుకున్న పూర్ణ, ఆమె బృందం సభ్యులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయినంటూ గర్వంగా ఆమె పరిచయం చేసుకున్నారు.
అవకాశం లభిస్తే సరైన మద్దతు ఇస్తే అమ్మాయిలు చేయలేనిది ఏమీ లేదని ఆమె చెప్పింది. ఇప్పుడు తాము ఉత్తర దిశ నుంచి ఎవరెస్ట్ ఎక్కామని, మరోసారి అవకాశం వస్తే దక్షిణ దిక్కు నుంచి ఎవరెస్ట్ ఎక్కుతానని తెలిపింది. 8848 మీటర్ల ఎత్తున ఎవరెస్ట్‌పై నిలబడ్డప్పుడు స్వర్గంలో నడుస్తున్నట్లు అనిపించిందని, ఆనందంతో కళ్ల నుంచి నీళ్లు కారిపోయాయని చెప్పింది.
ఎవరెస్ట్ పై కనిపించిన అత్యద్భుతమైన దృశ్యం టీవీల్లో కానీ, కంప్యూటర్లలో కానీ కనిపించదని ఆనంద కుమర్ అన్నాడు. తమ నాన్న కొండలరావు సైకిల్ మెకానిక్ అని, తన అమ్మ వ్యవసాయ కూలీ అని చెప్పారు. దిగేప్పుడు తాడు తగిలి కిందపడ్డానని ఆయన చెప్పారు. అదృష్టం బాగుండి బ్రతికిపోయానని వివరించాడు. ఇంటర్ పరీక్షలపైనే ప్రస్తుతం తన ధ్యాస ఉందని చెప్పాడు.
వీరికి శిక్షణ ఇచ్చిన శేఖర్‌బాబు మాట్లాడారు. ఎవరెస్ట్ ఎక్కి న అత్యంత పిన్నవయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల అధికారి కెఆర్ రెడ్డి మాట్లాడుతూ - పేద పిల్లలు, గురుకుల పాఠశాలల విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంచేందుకే ఎవరెస్ట్ పర్వతారోహణ చేపట్టామని తెలిపారు. కాగా, ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి దళితులు పూర్ణ, ఆనంద్‌లని అఖిలభారత దళిత హక్కుల సమాఖ్య ప్రకటించింది.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఏపీభవన్‌లో జాతీయ దళిత మానవ హక్కుల ప్రచార సంఘం, ఎపి భవన్ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఏపీ భవన్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, సామాజిక సమన్యాయ కేంద్రాలతో కలిసి పూర్ణ, ఆనంద్‌లను ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపింది.

అమ్మానాన్న వ్యవసాయ కూలీలు
తమ నాన్న దేవిదాస్, అమ్మ లక్ష్మి ఇద్దరూ వ్యవసాయ కూలీలని, ఎవరెస్ట్ అధిరోహణ గురించి చెప్పినప్పుడు బాగా మద్దతు ఇచ్చారని మలావత్ పూర్ణ చెప్పారు.

శవాలు కనిపించాయి
బేస్ క్యాంపు నుంచి ఎవరెస్ట్‌పైకి వెళుతుంటే ఆరు శవాలు కనిపించాయని, చాలా భయం వేసిందని 13 సంవత్సరాల పూర్ణ చెప్పింది. తొమ్మిదో తరగతి చదువుతున్న తన ప్రస్తుత లక్ష్యం పదోతరగతి పరీక్షలేనని, ఆ తర్వాత ఐపీఎస్ కావాలని, పేదలకు సేవ చేయాలని ఉందని ఆమె తెలిపింది.

మొదటి దళితుడు
ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి దళితుడు 19 ఏళ్ల ఆనంద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. పేదలకు అవకాశం లభిస్తే ఎంత ఎత్తుకైనా ఎదగగలరని అన్నాడు.

అంకితం వారికే..
తమకు మద్దతిచ్చి, తమలో స్ఫూర్తి నింపిన ఐపిఎస్ ప్రవీణ్‌కుమార్‌కు, తమలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు తమ ఘనతను అంకితమిస్తున్నామని పూర్ణ, ఆనంద్ తెలిపారు.












Click it and Unblock the Notifications