ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజ్..!!
ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రవేశపెట్టిన శ్రీశైలం ప్యాకేజీ టికెట్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రోజూ 1,075 టికెట్లను జారీ చేస్తోన్నారు.
అమరావతి: రాష్ట్రంలో ఆలయ పర్యాటకానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఇప్పటికే దీనిపై పలు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పలు ప్యాకేజీలను ఏపీటీడీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి మంచి డిమాండ్ లభిస్తోంది.
ఏపీటీడీసీ బాటలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంట్రీ ఇచ్చింది. పర్యాటకాభివృద్ధి సంస్థ అమలు చేస్తోన్న టెంపుల్ టికెట్స్ ప్యాకేజీ తరహాలోనే ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీని అమల్లోకి తీసుకొచ్చింది.

శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వ్ చేసుకోవడంతో పాటు ధర్శనం టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రతీ రోజూ 1,075 దర్శనం టిక్కెట్లను దేవాదాయ మంత్రిత్వ శాఖ రిజర్వ్ చేసింది.
శ్రీశైలం వెళ్లే భక్తులు తమ దర్శనం టికెట్లను- బస్ టికెట్లతో పాటు బుక్ చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ లేదా కండక్టర్ ద్వారా శ్రీశైలం మల్లన్న దర్శనం టికెట్లను పొందవచ్చు. కాగా- రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి ప్రతి రోజూ 100 వరకు బస్సు సర్వీసులను నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ.
ఈ 1,075 దర్శనం టికెట్లు కూడా స్పర్శ, శీఘ్ర దర్శనానికి సంబంధించినవి. ఇందులో స్పర్శ దర్శనం కింద 275 టికెట్లను రిజర్వ్ చేశారు. ఈ టికెట్ విలువ 500 రూపాయలు. అతి శీఘ్ర దర్శనం కింద 300 టికెట్లను కేటాయించారు. దీని ధర 300 రూపాయలు. శీఘ్ర దర్శనం 500 టిక్కెట్లను రిజర్వ్ చేశారు. ఈ టికెట్ ధర 150 రూపాయలు.












Click it and Unblock the Notifications