అమరావతిలో చంద్రబాబు ప్రతిమలు: రేగుతున్న దుమారం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రతిమలను నెలకొల్పాలని తెలుగదేశం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తలపెట్టారు. ఇందుకు గాను రాజమండ్రికి చెందిన ప్రముఖ శిల్పి రాజకుమార్ ఉడయార్‌కు ఆర్డర్ ఇచ్చారు. అమరావతికి ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తుళ్లూరు గ్రామంలో శంకుస్థాపన చేసే చోట ఆ ప్రతిమను నెలకొల్పాలని సంకల్పించారు.
అయితే, ఆ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బతికి ఉన్నవారి విగ్రహాలను గానీ ప్రతిమలను గానీ నెలకొల్పకూడదనే నియమానికి అది విరుద్ధమని అంటున్నారు. రాజధాని నిర్మాణానికి పడిన కఠిన శ్రమకు గుర్తుగా చంద్రబాబు అభిమానులు ఆ ప్రతిమను నెలకొల్పాలని భావిస్తున్నారు.
అయితే, రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి విగ్రహాన్ని ఆయన జీవించి ఉన్న కాలంలోనే స్థాపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్షీరాం, మాయావతి విగ్రహాలను కూడా వారు బతికి ఉండగానే స్థాపించారు.

చంద్రబాబు ప్రతిమలను చాలా చోట్ల నెలకొల్పాలని భావిస్తున్నారు. ప్రతి ప్రతిమకు 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. 20 నుంచి 25 చంద్రబాబు ప్రతిమలను నెలకొల్పాలని ఆయన అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిమల స్థాపనపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ ప్రతిమల ప్రారంభ కార్యక్రమాలకు హాజరు కాకూడదని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
వివాదం నుంచి రాజకుమార్ ఉడయార్ దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాటిని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమత్ర గ్రామంలోని నట్టా రామేశ్వరం వద్ద తయారు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications