నితీశ్ కు ఓకే- జగన్ కు నో రెస్పాన్స్ : ప్రధాని దూరం పెట్టారా -సీఎం దూరమయ్యారా..!!
వైఎస్సారా్ కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో ఇటు ఏపీలో అధికారంలోకి రావటంతో పాటుగా సంఖ్య పరంగా లోక్ సభలో అతి పెద్ద నాలుగో పార్టీగా ఎదిగింది. లోక్ సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఆరుగురు సభ్యులు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్డీఏ భాగస్వామిగా-బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించింది. బీజేపీ నుంచి టీడీపీని దూరం చేయటంలో జగన్ సక్సెస్ అయ్యారు. ప్రత్యేక హోదా తో ముడిపెట్టి టీడీపీని టార్గెట్ చేయటంతో..ట్రాప్ లో చిక్కుకున్న టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది.

కేంద్రం పెద్దలతో సత్సంబంధాలే ఉన్నా..
అప్పటికే కేంద్ర పెద్దలతో వైసీపీ సంబంధాలు మెరుగు పడ్డాయి. ఇక, 2019 లో 151 సీట్లతో అధికారం దక్కించుకుని..చంద్రబాబును ఓడించిన తరువాత తొలి సారి ప్రధానిని కలవటానికి వెళ్లిన జగన్ ను అనూహ్య స్వాగతం లభించింది. ప్రధాని మోదీ జగన్ ను ఆలింగనం చేసుకొని అభినందించారు. ఇక, 22 మంది ఎంపీలు ఉండటంతో జగన్ ఖచ్చితంగా కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచటంలోనూ..డిమాండ్లు సాధించటంలోనూ సక్సెస్ అవుతారని అందరూ అంచనా వేసారు. జగన్ సైతం కేంద్రంతో సత్సంబంధాలే కొనసాగించారు.

జగన్ కు ఇచ్చే గౌరవంలో తేడా వచ్చిందా..
ప్రధాని-అమిత్ షా ఏపీ సీఎం జగన్ కు ఇచ్చిన ప్రాధాన్యత సైతం అదే స్థాయిలో కనిపించింది. కానీ, కాలం గడిచే కొద్దీ జగన్ ప్రాబల్యం కేంద్రం వద్ద తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అంతగా దగ్గరకు తీసిన కేంద్ర నేతలు జగన్ తో దూరంగా ఉండాలనుకుంటున్నా..లేక, జగన్ వారితో దూరం పాటిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవు తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటకీరణ అంశం ఇప్పుడ ఏపీలో సెంటిమెంట్ గా మారుతోంది. దీని పైన ఏపీలోని అన్ని పార్టీలు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. దీని పైన సీఎం జగన్ నేరుగా ప్రధాని కి లేఖలు రాసారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరించకుండానే ఏ రకంగా లాభాల్లో నిర్వహించే అవకాశం ఉందో వివరిస్తూ లేఖలో పేర్కొన్నారు.

జగన్ కు నో రెస్పాన్స్ - నితీష్ అడిగిన వెంటనే..
ఈ అంశం పైన అఖిలపక్ష నేతలతో కలిసి వచ్చేందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో కోరారు. అదే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసారు. కానీ, ఇప్పటి వరకు ప్రధాని నుంచి అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదు. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీ కులాలా వారీగా జనాభా గణన పైన ఆ రాష్ట్ర అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసింది. దీని పైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అఖిలపక్ష నేతలతో కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరగా ప్రధాని నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ రోజు నితీష్ నాయకత్వంలో అఖిలపక్ష నేతలు ప్రధానిని కలిసారు. నితీష్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు.

కేంద్రానికి బే షరతుగా మద్దతు ఇచ్చినా..
గతంలో బీజేపీతో విభేదించటం..తిరిగి దగ్గరవ్వటం జరిగింది. జగన్ ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోయినా...ఎటువంటి షరతులు లేకుండా..అదే తరహాలో సహకారం అందిస్తున్నారు. అన్ని బిల్లుల ఆమోదానికి..కేంద్ర నిర్ణయాలకు అడమద్దతు ఇస్తున్నారు. ఇక రాజ్యసభలో వైసీపీ మద్దతు బీజేపీకి కీలకంగా మారింది. వైసీపీ రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. రానున్న మార్చిలో మరో నలుగురు సభ్యులు వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక కానున్నారు. నితీష్ పార్టీకి లోక్ సభలో 16 మంది సభ్యులు ఉండగా.. రాజ్యసభలో 5 గురు ఉన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా వైసీపీ..
రానున్న రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు బీజేపీకి కీలకం కానుంది. అయితే, వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సమయం నుంచి వైసీపీ తీరులో ఒక్క సారిగా మార్పు కనిపిస్తోంది. పోలవరం పెంచిన అంచనాలకు ఆమోదం తెలపకపోవటం... ప్రతిపక్షాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఆర్దికంగా తోడ్పాటు ఇవ్వటం లేదనేది వైసీపీ నేతలకు రుచించటం లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా..తమ పార్టీ నుంచి ఎన్నికై తమను ఢిల్లీ కేంద్రంగా విమర్శిస్తున్న రఘురామ రాజు పైన ఫిర్యాదు ఇచ్చినా చర్యలు లేకపోవటం వైసీపీకి ఇబ్బందిగా మారింది.
దీంతో..తాము ఎంత సహకరించి నా బీజేపీ ముఖ్య నేతల నుంచి ఆ స్థాయిలో స్పందన ఉండటం లేదనేది వైసీపీ నేతల భావన. దీంతో.. ఇప్పుడు గ్యాప్ ఉన్నట్లుగా చర్చలు సాగుతున్నాయి. ఇది మరింతగా పెరుగుతుందో.. లేక, రెండు పార్టీలు రానున్న రోజుల్లో చక్కదిద్దుకోవటానికి ప్రయత్నాలు చేస్తాయా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications