తెలంగాణ కోసం కృష్ణావివాదాన్ని కెలికిన మోడీ- ఎన్నికల వేళ జగన్ సర్కార్ పై తీవ్ర ఒత్తిడి ?
ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజించి ఇప్పటికీ పంపకాలు పూర్తి చేయని కేంద్రం.. కృష్ణాజలాల వివాదాన్ని కెలకడం ద్వారా తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల వేళ తెలంగాణలో ఛాంపియన్ గా నిలిచేందుకు కృష్ణా ట్రైబ్యునల్ కు జీవం పోయాలన్న కేంద్రం వ్యూహాలు ఇప్పుడు ఏపీకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపకాన్ని తిరిగి చేపట్టాలన్న నిర్ణయంపై ఏపీలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి.
కృష్ణాజలాల పునఃపంపిణీ కోసం బ్రిజేష్ కుమార్ కు కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గతంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో పాటు దానికి అతీతంగా కేటాయించిన మిగులు జలాలు, పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గోదావరి ట్రైబ్యునల్ సమైక్య రాష్ట్రానికి కేటాయించిన జలాల వాటాను రెండు రాష్ట్రాలకు పంచేలా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. దీనిపై ఏపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఏపీ ప్రజల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని తదుపరి చర్యలు నిలిపేయాలని ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ కూడా రాశారు.

వాస్తవానికి ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించిన జలాల్ని అంగీకరించని తెలంగాణ అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల వేళ తిరిగి ఆ అంశాన్ని కెలికి లబ్ది పొందాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పునఃపంపకాల డిమాండ్ ను అంగీకరించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదంతా అంతిమంగా ఏపీకి నష్టం చేసేలా ఉందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దీన్ని అడ్డుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది.
తెలంగాణ ఎన్నికల కోసం కృష్ణాజలాల అంశాన్ని కెలికిన కేంద్రం..ఆ తర్వాత ఏపీ ఎన్నికలకు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కాస్తో కూస్తో సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా జలాల విషయంలో కేంద్రం దూకుడుగా ముందుకెళ్తోంది. అయితే ఇది అంతిమంగా బీఆర్ఎస్ కే లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. కానీ ఏపీ పరిస్ధితి మాత్రం దారుణంగా మారబోతోంది. కేంద్రం చర్యలతో ఏపీకి భవిష్యత్తులో తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదముందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే కేంద్రం చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో కృష్ణాజలాల పునఃపంపకాల వ్యవహారం కూడా మెడకు చుట్టుకోబోతోంది.












Click it and Unblock the Notifications