AP Elections: ఏపీలో ప్రచారానికి మోడీ- తాజా షెడ్యూల్ ఇదే..!
ఏపీలో ప్రధాని మోడీ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. గతంలో ఓసారి రాష్ట్రానికి వచ్చి చిలకలూరిపేట సభలో పాల్గొన్న మోడీ.. ఆ తర్వాత ఉత్తరాదిలో ప్రచారంలో ఉండిపోయారు. ఎట్టకేలకు రాష్ట్రంలో మోడీ రెండో పర్యటన ఖరారైంది. ఇందులో భాగంగా ప్రధాని ఈ నెల 6,8 తేదీల్లో రెండు విడతలుగా రాష్ట్రానికి రానున్నారు. ఇందులోనూ గతంలో అనుకున్న విధంగా నాలుగు సభలు కాకుండా మూడు బహిరంగ సభలు, ఓ రోడ్ షో ప్లాన్ చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పార్టీల తరఫున ప్రచారం కోసం ప్రధాని మోడీ ఈసారి మే 6వ తేదీన ఢిల్లీ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి సభా వేదిక ఏర్పాటు చేస్తున్న వేమగిరికి చేరుకుని సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరితో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి అనకాపల్లి వెళతారు. అక్కడ రాత్రి బహిరంగ సభ ఉంటుంది.
అనకాపల్లి బహిరంగసభ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్న ప్రధాని మోడీ.. తిరిగి 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి వస్తారు. అక్కడి నుంచి పీలేరు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి విజయవాడకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ చంద్రబాబు, పవన్ తో కలిసి రోడ్ షో నిర్వహిస్తారు. ఇది పూర్తయ్యాక తిరిగి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోతారు.












Click it and Unblock the Notifications