విశాఖపట్నంకు నరేంద్రమోడీ గుడ్ న్యూస్
విశాఖ ప్రజలకు వాసులకు కేంద్రం శుభవార్త వినిపించింది. స్థానికులకు అత్యంత భారంగా మారిన అగనంపూడి టోల్ ప్లాజాను తొలగిస్తామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. విశాఖపట్నం నగరంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న అగనంపూడి ప్లాజావల్ల స్థానికులపై కొన్ని సంవత్సరాల నుంచి అధిక భారం పడుతోంది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రస్తావించారు. జాతీయ రహదారులకు ఏడాది కాలంలో రూ.50వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినందుకు కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
సబ్బవరం, అనకాపల్లి మధ్య కొత్త జాతీయ రహదారిని నిర్మించారని, అయినప్పటికీ అగనంపూడి టోల్ ప్లాజా తీసేయకపోవడంవల్ల విశాఖ ప్రజలపై అదనపు భారం పడుతోందని జీవీఎల్ కేంద్రం దృష్టికి తెచ్చారు. స్థానికులకు కూడా ఎటువంటి మినహాయింపు లేదని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకొని టోల్ ప్లాజాను తొలగించాలని కోరారు.

ఈ టోల్ ప్లాజాను అతి త్వరలో తొలగిస్తామని మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి నిబంధనలను అనుసరించి కాంట్రాక్టర్ కు ఈ టోల్ ప్లాజాను మంజూరు చేయాల్సి వచ్చిందన్నారు. నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టర్‌కు ఉన్న కాలపరిమితి ముగియకముందే దీన్ని తొలగించడంవల్ల సదరు కాంట్రాక్టర్ కు ప్రభుత్వం భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు దీనివల్ల ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత తొందరగా తొలగిస్తామన్నారు. గడ్కరీ హామీ మేరకు దీన్నుంచి త్వరలోనే విశాఖపట్నం ప్రజలకు విముక్తి కలగబోతోందని బీజేపీ నాయకులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications