గోదావరి లాంచీ ప్రమాదంపై ప్రధాని మోడీ, మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటకుల లాంచీ బోల్తా కొట్టిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 13 మంది మరణించిన విషయం తెలిసిందే. గల్లంతైన వారు అధికంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
— Narendra Modi (@narendramodi) September 15, 2019
తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న లాంచీ ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. లాంచీ బోల్తా పడిన ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. గోదావరిలో వరద ఉధృతి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ బోటింగ్ కు అనుమతి ఇవ్వడం సరికాదని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.













Click it and Unblock the Notifications