జనవరి 6న ఏపీకి తీపి కబురు చెప్పనున్న నరేంద్ర మోడీ! అలాగే టార్గెట్ చంద్రబాబు
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు అప్పుడే మాటల దాడి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేనిలతో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ కూడా విమర్శలు చేస్తున్నారు.
తాము ఏపీకి ఏదో చేస్తారని బీజేపీతో కలిశామని, నాలుగున్నరేళ్లు చూశాక ఏమీ చేయకపోవడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని తాము చెప్పామని, యూపీఏ హయాం కంటే ఎక్కువ నిధులు ఇచ్చామని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీకి టీడీపీ దూరమయ్యాక మోడీ ఏపీకి రానున్నారు.

ఏపీకి వచ్చి నరేంద్ర మోడీ ఏం చెబుతారు?
దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనలో ఏపీకి ఏమిస్తారు, చంద్రబాబుకు ఎలా కౌంటర్ ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇచ్చిన హామీల మేరకు ఏపీకి చేసిన సాయాన్ని, ప్రత్యేక హోదా బదులుచేసిన ప్యాకేజీ సహాయాన్ని ప్రస్తావించడంతో పాటు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేయడంపై విమర్శలు గుప్పించే అవకాశముంది. ఈ పర్యటనలో చంద్రబాబును టార్గెట్ చేయనున్నారని తెలుస్తోంది.

ఓ శుభవార్త చెప్పేందుకే వస్తున్నారా?
ఈ విషయం పక్కన పెడితే నరేంద్ర మోడీ ఏపీకి ఓ శుభవార్త కూడా మోసుకు వచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. వచ్చే నెల ఆరున గుంటూరులో నిర్వహించనున్న సభకు వస్తున్న మోడీ ఏపీ ప్రజలకు తీపి కబురును చెప్పనున్నారా? అంటే అవుననే అంటున్నారు ఏపీ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు. ప్రజలకు మంచి వార్తను చెప్పేందుకే ఆయన ఏపీకి వస్తున్నారని ఆయన మదనపల్లెలో చెప్పారు.

శుభవార్త కచ్చితంగా ఏమిటో చెప్పలేం కానీ
ఆ తీపి కబురు ప్రత్యేక హోదా గురించా అని మీడియా ప్రతినిధులు ఆయనను (రమేష్ నాయుడు) ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. కచ్చితంగా చెప్పలేనని, ఏది ఏమైనా పెద్ద వార్తనే వింటారని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఏపీకి ఇచ్చినన్ని కేంద్ర నిధులు మరే రాష్ట్రానికీ రాలేదని, ఎన్డీయే సర్కారు ఇచ్చిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, మోడీ ఏపీకి వస్తుంటే భయపడుతున్న చంద్రబాబు, తన అనుచరులతో నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

మోడీ పర్యటనపై టీడీపీ నేతలు
కాగా, మోడీ పర్యటనపై చంద్రబాబు సహా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పాకే నరేంద్ర మోడీ ఏపీలో అడుగు పెట్టాలని చంద్రబాబు, టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని వంటి వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత చింతామోహన్ కూడా విమర్శలు గుప్పించారు.

క్షమాపణ చెప్పాలని చింతా మోహన్
విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రధాని మోడీ మోసం చేశారని చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి ఏపీలో పర్యటించే హక్కు లేదన్నారు. హామీలు నెరవేర్చనందుకు మొదట మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఏపీ అభివృద్ధిపై కేంద్రం శీతకన్ను వేసిందన్నారు.












Click it and Unblock the Notifications