మేయర్ హత్య: కీలక డాక్యుమెంట్లు సీజ్, చింటూ కోసం బెంగళూరులో గాలింపు
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడిగా భావిస్తున్న చింటూ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతని పాస్‌పోర్టు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
హత్యలో ఎవరి పాత్ర ఉంది, ప్రత్యక్ష సాక్షుల కథనం ఏమిటి... తదితర అన్నింటిని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో అనుమానితులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, చింటూ న్యాయస్థానం ఎదుట లొంగిపోతారనే ప్రచారం గురువారం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

చింటూ కదలికల పైన నిఘా పెట్టినట్లు శాంతిభద్రతల అదనపు డిజి ఆర్పీ ఠాకూర్ చెప్పారు. త్వరలోనే చింటూను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక బృందాలతో చింటూ కోసం దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, చింటూ ఆఛూకీ తెలిపితే రూ.లక్ష రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అదనపు డిజి ఆర్పీ ఠాకూర్ శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి మేయర్ దంపతుల హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మరోవైపు, చింటూ ఇప్పటికే లొంగిపోయినట్లుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చింటూ కోసం గాలింపు
చింటూ కోసం పోలీసులు ముంబై, బెంగళూరు వంటి నగరాల్లోను గాలిస్తున్నారు. ఇప్పటికే అన్ని విమానాశ్రయాలలో అప్రమత్తం చేశారు. చింటూ ఫోటోను, అతని పూర్తి వివరాలను అందించారు. తీవ్రంగా గాలిస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!