వాళ్ళు పోలీసులు కాదు కానీ వారికి పోలీస్ డ్రెస్ తో పాటు పోలీస్ హోదా .. ఏపీలో త్వరలో వారికి అఫీషియల్ ఆర్డర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో పనిచేసే వారే సహజంగా పోలీస్ యూనిఫాం లో దర్శనమిస్తారు. పోలీస్ యూనిఫాం తో విధుల్లో పాల్గొంటారు. అయితే పోలీస్ శాఖకు సంబంధించిన వారు కాకుండా గ్రామ , వార్డు సచివాలయాలలో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీస్ యూనిఫాం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయం లో పనిచేసే మహిళల సంరక్షణ కార్యదర్శులు ఇకనుంచి మహిళా పోలీస్ గా పిలుస్తారు. దీనికి సంబంధించి వారం పది రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

మహిళా సంరక్షణా కార్యదర్శులకు పోలీస్ యూనీఫాం ఇవ్వాలన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట దాడులు కొనసాగుతూనే ఉన్నాయి . ఈ క్రమంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం . సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల శాఖపై జరిపిన సమీక్ష సమావేశంలో మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీస్ యూనిఫాం కేటాయించాలని, అలా కేటాయించడం ద్వారా గ్రామంలోని అక్రమార్కులకు వెన్నులో వణుకు పుడుతోందని పేర్కొన్నారు .

మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట వెయ్యటానికి జగన్ నిర్ణయం
మహిళా సంరక్షణా కార్యదర్శులకు పోలీసు యూనీఫాం ఇచ్చి , మహిళా పోలీసులుగా బాధ్యత అప్పగిస్తే దారుణాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం కలుగుతుందని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఉద్యోగుల్లో కూడా మహిళల రక్షణ బాధ్యత పై ఉత్సాహం పెరుగుతుందని సీఎం జగన్ అన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శి పేరుతో పిలిచే ఉద్యోగులందరినీ మహిళా పోలీస్ అని పిలవాలని ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఈమేరకు చర్యలకు ఉపక్రమించింది. త్వరలోనే ఈ దిశగా మార్పులు జరుగుతాయని చెప్పారు గ్రామ , వార్డు సచివాలయ శాఖ కమీషనర్ నవీన్ కుమార్ .

రాష్ట్రంలో మొత్తం 14, 948 మహిళా సంరక్షణా కార్యదర్శి పోస్టులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ఉన్నాయి . అయితే వాటిలో ఒక్కొక్కరు చొప్పున మహిళా సంరక్షణ కార్యదర్శి ఉన్నారు. మొత్తం 14, 948 పోస్టులకు గాను 13, 677 పోస్టులను ఈ ఏడాది జనవరి నాటికి భర్తీ చేశారు. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతోంది. మహిళా సంరక్షణ కార్యదర్శులు, పాఠశాలలు, కళాశాలలలో మహిళల రక్షణ, రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ అంటే తదితర అంశాలపై కూడా పనిచేస్తున్నారు.

మహిళా పోలీస్ అని పిలవాల్సిందే .. ఏపీలో మహిళా పోలీస్ నిర్ణయంపై ఆసక్తికర చర్చ
మహిళలపై వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులను ఇతరులతో పాటుగా, మద్యపాన నియంత్రణ కోసం బెల్టు షాపులు ఏర్పాటు చేయడం, నాటుసారాను అరికట్టడం వంటి చర్యలలో పాలుపంచుకుంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా వీరందరిని మహిళా పోలీసుగా పిలవాలని, వారందరికీ పోలీస్ యూనిఫాం ఇవ్వాలని చెప్పడం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో పని చేయని పోలీస్ ఎవరు అంటే మహిళా పోలీస్ అని చెప్తారు అన్న చర్చ సాగుతోంది.