బాహుబలి ఎఫెక్ట్! పవన్, ప్రభాస్ ఫ్యాన్స్‌కు పోలీసుల వార్నింగ్: గీత దాటితే అంతే!
ముందస్తు చర్యల్లో భాగంగా ఫ్యాన్స్ కు కౌన్సెలింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
భీమవరం: పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే ఆ సందడి మొదలైపోతుంది. ఇక అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కటౌట్లు, పాలాభిషేకాలు, ఫ్లెక్సీలు, థియేటర్లను ముస్తాబు చేయడం.. టపాకాయలు కాల్చడం, హీరో గారికి జిందాబాద్‌లు కొట్టడం.. ఆరోజంతా ఇదే తంతు కొనసాగుతుంది.
ఇక్కడివరకు అంతా బాగానే ఉంటుంది కానీ పొరపాటున ప్రత్యర్థి హీరో అభిమాని ఎవరైనా థియేటర్ వద్దే సినిమా నచ్చలేదన్నాడనుకో!.. సీన్ రచ్చ రచ్చయిపోతుంది. అచ్చు 'నేనింతే' సినిమాలో చూపించినట్లుగా.. థియేటర్ ముందే ఇరు వర్గాలు ఘర్షణలకు దిగే పరిస్థితి తలెత్తుంది.
ఇక యాంటీ ఫ్యాన్స్ సంగతి సరేసరి.. ఎంతసేపు సినిమా మీద రాళ్లు వేయడమే వీరి పని. ఆ క్రమంలో సోషల్ మీడియాలోను అభిమానుల మధ్య వార్ నడిచిన సందర్భాలెన్నో!. ఇకపోతే ఈ ఫ్యాన్స్, ఎగస్ట్రా వాటితో ఎలాంటి సంబంధం లేని అభిమానులు సైతం అప్పుడప్పుడు బలైపోతుంటారు. కారణం.. సినిమాపై నిక్కచ్చిగా తమ అభిప్రాయం చెప్పడమే. అది గనుక తమ హీరోకు ప్రతికూలంగా ఉంటే.. సదరు ఫ్యాన్స్ వాళ్లపై ఎటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. తెలుగు జనమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బాహుబలి-2 మరో 48గం.ల్లో తెలుగు తెర మీద సందడి చేయబోతుంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఫ్యాన్స్ కు కౌన్సెలింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా భీమవరంలోని పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులను పోలీసుల స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఘర్షణకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారిని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications