వైసీపీ సెక్షన్లు అమలు చేసిన పోలీసు అధికారుల అడ్రస్సు గల్లంతు, సీఎం దెబ్బతో ఔట్
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు వీరవిధేయులుగా ముద్ర వేసుకున్న పోలీసు అధికారుల అడ్రస్సు గల్లంతు అయ్యింది. గత ఐదు సంవత్సరాల్లో ఐపీసీ సెక్షన్లు మరిచిపోయి వైసీపీ సెక్షన్లు అమలు చేశారని చాలా మంది పోలీసు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పోలీసు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం రాదని వైసీపీ నాయకులు చెప్పడంతో ఆ నాయకుల మాటలను నమ్మిన పోలీసు అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో గతంలో పని చేసిన పోలీసు అధికారులు పోస్టింగులకు చెక్ పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో కుప్పంలో పని చేసిన పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నారో కూడా సాటి పోలీసులకు తెలీకుండా పోయింది.

మహా అయితే మమ్మల్ని ఎక్కడికో అక్కడికి బదిలీ చేస్తారని, మా ఉద్యోగాలు సేఫ్ గా ఉంటాయని, అక్కడా వైసీపీ నాయకులు ఉంటారని అనుకున్న పోలీసు అధికారులకు ఇప్పుడు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ బ్రాండ్ ముద్ర వేసుకుని, వివాదాస్పద పోలీసు అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్న చిత్తూరు వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి, కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు, చిత్తూరు డీటీఆర్ బీ సీఐ ఎం. జయరామయ్యల పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది.
సీఐలు కత్తి శ్రీనివాసులు, విశ్వనాథ్ రెడ్డి, జయరామయ్యను ఏకంగా చిత్తూరు ఎస్పీ కార్యాలయంలోని వీఆర్ కు పంపించేశారు. వీరికి పోస్టింగ్ లు ఇప్పట్లో లేవని, అసలు పోస్టింగ్ ఇస్తారో, లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంతకాలం వీఆర్ లోనే పెట్టేస్తారో ? అనే విషయం కూడా అంతు చిక్కడం లేదని సాటి పోలీసు అధికారులు అంటున్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు విన్నారని ఆరోపణలు ఉన్నాయి.

గత వైసీపీ ప్రభుత్వంలో, ముఖ్యంగా చివరి రెండు సంవత్సరాల్లో చిత్తూరు, కల్లూరు, పుంగనూరు, కుప్పంతో పాటు పలు నియోజక వర్గాల్లో టీడీపీ నాయకులను పోలీసు అధికారులు వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైసీపీ నాయకులు చెప్పినట్లు ఆడిన పోలీసు అధికారులు అందరినీ బదిలీ చెయ్యాలని టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు ఏ పోలీసు అధికారి మీద బదిలీ వేటు వేస్తుందో తెలీక కొందరు పోలీసు అధికారులు హడలిపోతున్నారు.
అయితే గతంలో మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన పోలీసు అధికారులను వదలకూడదని, అందరిని బదిలీ చేయించాలని చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే కుప్పం, పుంగనూరు నియోజక వర్గాల్లో పోలీసు అధికారుల అడ్రస్సు గల్లంతు అయ్యింది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వన్ సైడ్ పోలీసు అధికారుల అడ్రస్సులు కూడా తారుమారు అవుతున్నాయి.












Click it and Unblock the Notifications