కోనసీమ విధ్వంసం వెనుక - పోలీసుల గుర్తింపు : వారే కారణమంటూ..!!
అమలాపురం లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఊహించని విధంగా చోటు చేసుకున్న విధ్వంసంతో ఒక్క సారిగా పరిస్థితులు చేజారాయి. బస్సులు దగ్డమయ్యాయి. మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే నివాసం అగ్నికి ఆహుతి అయింది. పోలీసుపైన రాళ్ల వర్షం కురిసింది. ఎస్పీతో సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో..అమలాపురంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. డీజీపీ ప్రతీ క్షణం అక్కడి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారులు అమలాపురంలో మకాం వేసారు.

అమలాపురంలో సీనియర్ల మకాం
ఈ రోజున ఛలో రావులపాలెంకు పిలుపునివ్వటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అమలాపురం లో సెక్షన్ 144తో పాటుగా యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. ఇక, ఈ విధ్వంసం వెనుక ఉన్నదెవరు కోణంలో విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసారు. 73 మందిని గుర్తించారు. వారిలో 46 మందిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. విధ్వంసాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అమలాపురంలో రెండు వేల మంది పోలీసులను మోహరించారు. సోషల్ మీడియాలో ప్రచారం పైన ఫోకస్ పెట్టారు. ఇంటర్నెట్ ను ఈ రోజు బంద్ చేసారు.

విధ్వసంలో పాల్గొన్న వారి గుర్తింపు ప్రక్రియ
ప్రధానంగా మంత్రి - ఎమ్మెల్యే ఇళ్ల పైన దాడులు చేసి నిప్పు పెట్టిన వారిని..బస్సులను దగ్దం చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. స్థానికంగా సేకరిస్తున్న సమాచారంతో పాటుగా సీసీ కెమేరాలు... నిఘా- ఎస్బీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో నిందితుల ను గుర్తిస్తున్నారు. మంగళవారం మధ్నాహ్నం నుంచి ఆందోళనకారులను చెదరగొట్టామని డీఐజీ పాల్ రాజ్ చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం 3 గం.కు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారన్నారు. కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం ఇస్తామని చెప్పారని.. అదేసమయంలో వెనుకనుంచి ఒక్కసారిగా కొంతమంది దూసుకొచ్చారని వివరించారు. నిరసనకారుల్లో కొంతమంది విధ్వంసాన్ని సృష్టించారని చెప్పారు. ఇంకా మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటామని వివరించారు.

ఏడు కేసులు నమోదు..అదుపులోకి విధ్వంసకారులు
అన్ని జిల్లాల నుంచి సీనియర్ పోలీసు అధికారులు వచ్చారని..శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో అందరూ సహకరించాలని కోరారు. ఇదే సమయంలో ఈ విధ్వంసం పైన రాజకీయంగా ఆరోపణలు మొదలయ్యాయి. ఇది టీడీపీ - జనసేన నేతలు చేసిన పనిగా మంత్రులు - వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం చెందిందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసులు - ప్రభుత్వం వైఫల్యం చెందాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే, ముందుగా శాంతి భద్రతల పరిరక్షణ.. విధ్వంసంలో పాల్గొన్న వారిని గుర్తించి చర్యల దిశగా పోలీసు ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితి వాకబు చేస్తున్నట్లు సమాచారం.