కల్తీ మద్యం ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు: అజ్ఞాతంలోకి మల్లాది విష్ణు?
విజయవాడ: కల్తీమద్యం కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కల్తీ మద్యం ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ మహేశ్‌చంద్ర లడ్డా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు.
సిట్‌లో గ్రేహౌండ్స్ ఎస్పీ సెంథిల్‌కుమార్, డీఎస్పీలు టి కనకరాజు, ఎం వెంకటేశ్వరరావు, సీఐలు వైవీ నాయుడు, కె శ్రీనివాసరావు, అబ్దుల్ కరీం, సీహెచ్ రాంబాబు, మీరా సాహెబ్‌లను నియమించారు. విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో సిట్ పనిచేయనుంది.

స్వర్ణ బార్‌లో మద్యంలోనే కల్తీ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. కాగా, ఈ బార్‌లో కల్తీమద్యం సేవించి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు.
అజ్ఞాతంలోకి మల్లాది విష్ణు
కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. కాగా, విజయవాడలో బుధవారం మద్యం షాపులు తిరిగి తెరచుకున్నాయి. ప్రభుత్వం నిషేధం విధించిన 9బ్రాండ్లు మినహా మిగితా మద్యాన్ని విక్రయాలు సాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications