నారాయణ అరెస్ట్ - వైసీపీ సాధించిందేంటి : టీడీపీకి మైలేజ్ దక్కేలా..!!
మాజీ మంత్రి నారాయణను పదో తరగతి పరీక్షా పత్రాల లీక్ అంశంలో అరెస్ట్ చేసారు. ప్రశ్నా పత్రాల లీక్ వెనుక నారాయణ ఉన్నారనే ఆధారాలు సేకరించిన తరువాతనే అరెస్ట్ చేసామంటూ చెప్పుకొచ్చారు. ప్రశ్నా పత్రాలను బయటకు పంపి..తమ విద్యార్ధులకు ర్యాంకుల కోసం మాల్ ప్రాక్టీసు పాల్పడుతున్న సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వారి నుంచి పూర్తి సమాచారం సేకరించారు. గత నెల 27వ తేదీన నమోదు చేసిన కేసులో.. ఈ నెల 10వ తేదీన నారాయణను అరెస్ట్ చేసారు. అందునా హైదరాబాద్ నుంచి చిత్తూరు తీసుకెళ్లారు.

నారాయణకు సంబంధం లేదంటూ
అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఆ వెంటనే బెయిల్ మంజూరు అయింది. నారాయణ ను విచారించారా లేక, కీలక సమాచారం ఏదైనా రాబట్టారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే, నారాయణ 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు నారాయణ తరఫున న్యాయవాది తెలిపారు.

ఆ సాంతికేతిక అంశం కీలకంగా
నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు..అదే సమయంలో నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని నారాయణ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. నారాయణ 2014 లో మంత్రిగా బాధ్యతల స్వీకరణకు ముందే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి రాజీనామా చేసారని తెలుస్తోంది. అయితే, ఈ కేసులో నారాయణ ను నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ గా ప్రస్తావించిన కారణంగానే సాంకేతికంగా వెంటనే బెయిల్ వచ్చిందనే చర్చ అధికార పార్టీలో కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని... ఎవరినీ వదలద్దని సీఎం ఆదేశించారంటూ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం - ప్రతిపక్షంలో చర్చలు
అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి చిత్తూరు తీసుకొచ్చే వరకూ దీని పైన పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, నారాయణ పైన నమోదు చేసిన అభియోగాలను నిరూపణలో ఏం జరిగిందనేది సైతం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. ఆయన అరెస్ట్ సమయం నుంచి టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన నారాయణ విద్యా సంస్థల వ్యవహారాలకు దూరంగా ఉంటున్నా...ఆయన్ను ఏదో రకంగా వేధించాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేసారంటూ విమర్శలు చేసింది. ఇప్పుడు నారాయణ కు అసలు నారాయణ విద్యా సంస్థల బాధ్యతల్లోనే కొనసాగటం లేదనే సాంకేతిక అంశం చుట్టూ ఇప్పుడు ఈ వ్యవహారం తిరుగుతోంది. అయితే, ఇప్పుడు దీనినే టీడీపీ ప్రభుత్వం పైన రాజకీయ అస్త్రంగా మలచుకొనేందుకు సిద్దమవుతోంది.