తెలుగువారిని జగన్, బాబే అవమానిస్తున్నారు: పొన్నం
హైదరాబాద్: రాష్ట్ర విభజన వి,యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, ఆ పార్టీ తెలంగాణ నేతలపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు జ్ఝానం ఉందా, లేదా అని ఆయన అడిగారు. పూర్తి అజ్ఝానంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. తెలుగు ప్రజలను అవమానించేది చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అని ఆయన అన్నారు.
తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులకు కళ్లూ చెవులూ లేవని, చీమూ నెత్తురు లేనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అడ్డుకోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని బిజెపి అగ్రనేత అద్వానీ చెప్పిన మాటలను టిడిపి తెలంగాణ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు అంతా ఒక్కటై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తున్నారని, అయినా వెనక్కి వెళ్లకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ నాయకులు సోనియాను విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లేనని ఆయన అన్నారు.

తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని అధికారంలో ఉన్నాం కాబట్టి చెబుతున్నామని, సీమాంధ్రులు కుట్ర చేస్తే అడ్డుకునేది కూడా తామేనని ఆయన అన్నారు. గ్రామగ్రామాన ఈ నెల 9వ తేదీన సోనియాకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాలు జరగాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని, ఎవరూ దాన్ని అడ్డుకోలేరని ఆయన చేశారు. ప్రజలు కాంగ్రెసుపై నమ్మకం ఉంచాలని ఆయన అన్నారు. ఉద్యమ సారథిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షు కె చంద్రశేఖర రావును తాము గౌరవిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల ఆత్మగౌరవాన్ని బయటకు తీసుకుని వెళ్లి తాకట్టు పెట్టవద్దని ఆయన కోరారు. పార్టీ గౌరవాన్ని, సిడబ్ల్యుసి గౌరవాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిలబెట్టాలని ఆయన అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. రాష్ట్ర విభజన దేశద్రోహంలా జరుగుతుందనే మాటలను తమ ప్రాంత ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తాము సహాయం అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications