పోర్ట్‌కు భూసేకరణ: కొల్లు రవీంద్ర, కొనకళ్లలకు చేదు అనుభవం
మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు మరోసారి రైతుల నుండి పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌తో పోర్టు బాధిత రైతుల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను నివృత్తి చేసేందుకు కొన్నిరోజులుగా మంత్రి రవీంద్ర, ఎంపి నారాయణరావు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం బుద్ధాలపాలెం గ్రామానికి వెళ్లిన వీరిని గ్రామస్థులు అడ్డుకున్నారు. పోర్టు, పరిశ్రమలకు భూములిచ్చేది లేదంటూ నినాదాలు చేశారు. తమ ఊరి నుండి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. తన భూముల జోలికి వస్తే సహించబోమంటూ హెచ్చరించారు.

కొందరు రైతులు కుర్చీలు గాల్లోకి విసిరేసి నిరసన తెలిపారు. మంత్రి రవీంద్ర రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రైతుల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్న ప్రజాప్రతినిధులు చివరికి ఆ గ్రామం నుండి వెనుతిరగాల్సి వచ్చింది.
మూడురోజుల క్రితం కోన గ్రామానికి వెళ్లినప్పుడు కూడా మంత్రి రవీంద్ర, ఎంపి నారాయణరావులను ఆ గ్రామస్థులు అడ్డుకుని తరిమికొట్టినంత పనిచేశారు. తాజాగా మంగళవారం బుద్ధాలపాలెం గ్రామస్థులు మంత్రి, ఎంపిలను అడ్డుకుని ఊరి నుండి వెళ్లిపోవాల్సిందిగా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications