బాబు అసంతృప్తి, మంత్రివర్గ ప్రక్షాళన చేస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన జపాన్ పర్యటన అనంతరం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కేబినెట్ భేటీలో చంద్రబాబు పలువురు మంత్రుల పని తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.
మంత్రివర్గం ఏర్పడి ఐదు నెలలు గడిచినప్పటికీ అనేకమంది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నారన్న అసంతృప్తి చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. అనేక మంత్రివర్గ సమావేశాల్లో పని తీరు పైన హెచ్చరికలు చేశారు. అయినా కొందరి పనితీరులో మార్పు లేదని భావిస్తున్నారని అంటున్నారు.

దీంతో, కేబినెట్‌లోనే మార్పులు చేయాలని భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే భారీ మార్పులు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీని కోసం చంద్రబాబు అంతర్గత కసరత్తు కూడా చేస్తున్నారంటున్నారు. ప్రస్తుత మంత్రుల్లో కనీసం ఐదుగురి పని తీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు.
పని తీరు సక్రమంగా లేనివారిలో ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, రాష్ట్ర మంత్రివర్గంలో 26 మందిని చేర్చుకునేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 19మంది మాత్రమే ఉన్నారు. మరో ఏడుగురిని చేర్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి.
కొత్తగా ఏడుగురికి అవకాశం కల్పిస్తూనే ఉన్న వారిలో కొందరిని మార్చే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఉన్న మంత్రులను తప్పించడంపై చంద్రబాబు పునరాలోచన చేసే పరిస్థితి ఉత్పన్నమైతే వారి శాఖలను మార్పు చేసే అవకాశాలూ ఉంటాయంటున్నారు.












Click it and Unblock the Notifications