Chiranjeevi: ప్రజారాజ్యమే.. జనసేన!
విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'లైలా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం, జనసేనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరాటే రాజు అనే వ్యక్తిని పరిచయం చేస్తూ.. ఆయన 17 ఏళ్ల క్రితం తనతో కలిసి ప్రజారాజ్యంలో పనిచేశారన్నారు చిరంజీవి. ఆ తర్వాత జై జనసేన అని అన్నారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.
ఈ క్రమంలో ప్రజారాజ్యం మారిపోయిందని అన్నారు. ప్రజారాజ్యం జనసేనగా మారిపోయిందని చెప్పారు. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఐయామ్ వెరీ హ్యాపీ అని అన్నారు. దీంతో అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి వ్యాఖ్యలతో అటు మెగా, ఇటు జనసేన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

#PrajaRajyam roopantharam chendindii ade #Janasena - @KChiruTweets 😍😍😍🔥🔥🔥🔥 pic.twitter.com/hQ4Q7gWauI
— Kalyan (@kalyankartik) February 9, 2025
కాగా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని గతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 26 ఆగష్టు, 2008 ప్రజా రాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు.ప్రజా రాజ్యంలో ప్రజలే పాలకులు నేను వారధిని అనేది చిరంజీవి భావన. కాగా, ప్రజారాజ్యంలో యువరాజ్యం విభాగానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించారు. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు ప్రజారాజ్యం గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది.
పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు. అయితే, ఆగష్టు 2011లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రిగానూ చిరంజీవి పనిచేశారు. అయితే, ఉమ్మడి రాష్ట్ర విభజన క్రమంలో చిరంజీవి సోదరుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.
అనంతరం 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు.2019లో పోటీ చేసి ఒక సీటు సాధించారు. తాజాగా, ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఏకంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. రెండు ఎంపీ స్థానాలను కూడా గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు.












Click it and Unblock the Notifications