పవన్ కు తోడుగా చిరంజీవి - ఐక్యంగా పని చేస్తాం : అభిమాన నేతల నిర్ణయం.!!
తిరుపతి వేదికగా ఆసక్తి కర సమావేశం జరిగింది. పూర్వ ప్రజారాజ్యం పార్టీ మిత్రుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. అందులో ఏపీలోని రాజకీయాలు..తమ భవిష్యత్ పాత్ర పైన చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో చిరంజీవి స్థాపింపిన ప్రజారాజ్యంలో పని చేసి ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న నేతలంతా ఒక్క చోటకు చేరారు. భవిష్యత్ పరిణామాలపైన చర్చించారు. సమావేశంలో చిరంజీవి ఫొటో ఏర్పాటు చేసారు. నాడు ప్రజారాజ్యంలో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి సున్నిత మనస్కుడని.. రాజకీయాయల్లో రాణించలేకపోవటం వెనుక కారణాలు చాలా ఉన్నాయంటూ అభిప్రాయ పడ్డారు. ప్రజారాజ్యం పార్టీ అందించిన స్ఫూర్తి నుంచే జనసేన ఆవిర్భవించిందని నేతలు చెప్పుకొచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారని విశ్లేషించారు. పాలనలో చోటు చేసుకుంటున్న అన్యాయాలు..అక్రమాలను ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ పాలన..ఏపీ ఆర్దిక పరిస్థితి గురించి చర్చించారు. రాజ్యంగా హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. న్యాయపరంగా ఇచ్చే తీర్పును అమలు కావటం లేదని కొందరు నేతలు వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైనా ఉందని నేతలు చర్చించారు.

2014ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన ప్రతిపాదన పైనా సమావేశంలో ప్రస్తావన కు వచ్చింది. 2014 తరహాలోనే తిరిగి పని చేయాలనే ఆకాంక్ష వ్యక్యమైంది. ఇదే సమయంలో చంద్రబాబు - పవన్ కళ్యాణ్ విజయవాడ కేంద్రంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలు కలిసి పని చేయాలనే ప్రతిపాదనకు సమావేశంలో మద్దతు ప్రకటించారు. ఆ ఇద్దరు నేతలు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని నేతలు స్పష్టం చేసారు. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ కు తోడుగా చిరంజీవి కలిసి వస్తే సంతోషిస్తామని పలువురు నేతలు పేర్కొన్నారు.
అన్నయ్య తాను మద్దతుగా నిలుస్తానంటూ తాజాగా చేసిన ప్రకటన పైనా చర్చ జరిగింది. భవిష్యత్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని నేతలు వెల్లడించారు. ఇక, ఈ రోజు రాజమండ్రి వేదికగా వైసీపీ కాపు నేతల కీలక భేటీ జరగనుంది. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఈ సమావేశం జరగటానికి ముందుగానే తిరుపతిలో జరిగిన పూర్వ ప్రజారాజ్యం మిత్రుల సమావేశం, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదికగా మారుతోంది.