మత్తుమందిచ్చి అత్యాచారం.. రాధ కేసులో ఎన్నో అనుమానాలు
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకున్న హత్యోదంతంలో నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితుణ్ని నమ్మి జీవితం బాగుపడేందుకు అప్పు ఇచ్చిన మహిళనే అత్యంత పాశవికంగా చంపేయడం అందరినీ విస్మయపరుస్తోంది. తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోట మోహన్‌రెడ్డి భార్య కోట రాధ(35) తన స్వగ్రామమైన జిల్లెళ్లపాడు వచ్చి దారుణ హత్యకు గురయ్యారు.
వ్యాపారం కోసం వీరినుంచి రూ.80 లక్షలు అప్పుగా తీసుకున్న కేతిరెడ్డి కాశిరెడ్డి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. తీసుకున్న అప్పులో కొంత నగదును తిరిగి చెల్లిస్తానని మెసేజ్ చేయడంతో రాధ కనిగిరి వచ్చారు. పామూరు బస్టాండ్ సెంటర్ లో వేచిఉన్న ఆమెను ఎరుపు రంగు కారులో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి తమ స్వగ్రామం సమీపంలో ఆమె మృతదేహం కనిపించింది. రాధ హత్య కేసులో నలుగురుకు మించిన వ్యక్తులు పాల్గొని ఉంటారనే అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటుచేసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో గాలిస్తున్నారు.

బతికుండగానే నరకం చూపారు హత్యకు గురవడానికి ముందు రాధపట్ల నిందితులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. కారుతో ఢీకొట్టి ఆమె పైనుంచి వాహనాన్ని నడిపారు. దీంతో రాధ పక్కటెముకలు విరిగిపోయాయి. సిగరెట్లతో కాల్చిన గాయాలనూ గుర్తించారు. కారులో ఎక్కేందుకు ఆమె తటపటాయించడంతో నమ్మబలికి తీసుకువెళ్లారు. తర్వాత రాధకు మత్తుమందిచ్చారా? మత్తు ఇంజక్షన్ చేశారా? అనే అనుమానాన్ని ఆమె బంధువులు వ్యక్తం చేస్తున్నారు.
ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సంఘటనా స్థలంలోని పరిస్థితులనుబట్టి అర్థమవుతోందని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆమె జీవించి ఉండగానే రోడ్డుపై ఈడ్చుకెళ్లారని, కాలు మెలితిప్పి విరిచేశారని భావిస్తున్నారు. చివరకు ప్రాణం పోయిందని ఖరారు చేసుకున్న తర్వాత రాధ మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేసినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications