వైసీపీలోకి కీలక నేత రీ ఎంట్రీ - మారుతున్న లెక్కలు..!?
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా మాజీ సీఎం జగన్ పోరుబాట ప్రారంభించారు. క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులు కీలక నిర్ణయాలకు కారణం అవుతున్నాయి. 2024 ఎన్నికల వేళ వైసీపీని వీడిన నేతల్లో కొందరు ఇప్పుడు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఒక కీలక నేత తో ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి పార్టీలోకి వస్తారనే చర్చ జరుగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తయింది. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జగన్ పర్యటనలతో వైసీపీలో తిరిగి జోష్ కనిపిస్తోంది. పార్టీ వీడిన నేతలు కొందరు తిరిగి టచ్ లోకి వచ్చారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ ఉన్నారు. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన కాంగ్రెస్ టీడీపీ నుంచి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆయన ఓటమి పాలు అయ్యారు. పోనీ సర్దుకుందామని అనుకుంటే తన రాజకీయ ప్రత్యర్ధి కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలో చేరడం అది కూడా తనను ఓడించిన వారు తన పార్టీలోకి రావడం, తన సొంత సీటు ఆయనకు ఇచ్చి తనను వేరే చోటకు వైసీపీ అధినాయకత్వం వెళ్ళమనడంతో అలిగిన క్రిష్ణ మోహన్ 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమంచి ఆ పార్టీ తరఫున డిపాజిట్ తెచ్చుకున్న ఏకైక లీడర్ గా నిలిచారు. అయితే ఇపుడు ఆయన మీద వైసీపీ చూపు పడింది అని అంటున్నారు. ఆయనను తెచ్చి పార్టీలో గట్టి నేతగా నిలబెడితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి కొత్త వెలుగులు వస్తాయని ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. తాజాగా వైసీపీ ఒంగోలులో రీజనల్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం పైన చర్చ జరిగింది. జిల్లాలో వైసీపీకి కీలకంగా వ్యవహరించిన బాలినేని జనసేనలోకి వెళ్లారు. ఇక.. ఆమంచి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని భావిస్తున్న వేళ.. ఆయనతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమంచి జనసేన లేదా వైసీపీలోకి తిరిగి వస్తారని ప్రచారం సాగుతోంది.

జనసేన కూటమిలో ఉండటం.. మూడు పార్టీలకు చీరాల లో నేతలు ఉండటంతో... వైసీపీలోకి రావటం ద్వారా వచ్చే ఎన్నికల కోసం ముందస్తుగానే లైన్ క్లియర్ చేసుకోవచ్చనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆమంచి నియోజకవర్గం చీరాల టీడీపీకి సిట్టింగ్ స్థానం కావటంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగినా జనసేనకు ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అయితే, చీరాల - అద్దంకి విషయంలో జగన్ ఫైనల్ నిర్ణయం కీలకం కానుంది. జనసేనలోకి వెళ్లిన బాలినేనికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాధాన్యత లేని అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా కూటమిలోకి వెళ్లటం కంటే వైసీపీ నుంచి సీటు పైన హామీ వస్తే ఆ పార్టీలోకి వెళ్లాలని మద్దతు దారులు సూచన చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఆమంచి తిరిగి వైసీపీలో చేరుతారనే చర్చ వేళ.. తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది












Click it and Unblock the Notifications